నా ప్రాణాలకు బాధ్యత పీకేనా? బండ్ల గణేషా?.. కత్తి మహేష్ ఆందోళన

0kathi-maheshసినీ విమర్శకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదం మరింత ముదురుతోంది. టీవీ చర్చా కార్యక్రమాలు, పలు ఇంటర్వ్యూలు వీరి మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లు అవుతోంది.

పవన్ కళ్యాణ్ అభిమానులు తనను బూతులు తిడుతూ, బెదిరిస్తున్నారని, వారి నుండి తనకు ముప్పు పొంచి ఉందని, ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు కత్తి మహేష్ వెల్లడించారు.

పవన్ కళ్యాణ్‌ను ఆయన అభిమానులు దేవుడగా భావిస్తారు, ఆయన్ను ఎవరైనా ఏమైనా అంటే వారు ప్రతిఘటిస్తారు…. ఈ విషయం నేను అర్థం చేసుకోగలను, అయితే వారు తనను హెచ్చరిస్తున్న తీరులో హింసాత్మకధోరణి కనపడుతోందని, కొడతాం, చంపుతాం అంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని కత్తి మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు.

నిర్మాత బండ్ల గణేష్ కూడా మాడిమసైపోతావు అంటూ హెచ్చరించారని, ఒక వ్యక్తిని హెచ్చరించే సమయంలో ఉపయోగించే భాష చాలా ముఖ్యమని, బండ్ల గణేష్ వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ స్పూర్తి పొంది, తనను నిజంగా మాడ్చేస్తే… ఆ బాధ్యతను పవన్ తీసుకుంటారా? లేదా బండ్ల గణేష్ తీసుకుంటారా? అని కత్తి మహేష్ ప్రశ్నించారు.

‘కాటమరాయుడు’ సినిమా బాగోలేదని తాను రివ్యూ రాయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తనపై కక్ష పెంచుకున్నారని, తన ఫోన్ నెంబర్ ఫ్యాన్ పేజీలో షేర్ చేశారని, అప్పటి నుండి వేల సంఖ్యలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కత్తి మహేష్ తెలిపారు.

ఒకరి మాట నచ్చకపోతేనో, అభిప్రాయం నచ్చకపోతేనో…. వారిని బెదరించడం, వారిపై దాడి చేయడం లాంటి విష సంస్కృతి పెంచి పోషించవద్దని…. మనది ప్రజాస్వామ్య రాజ్యం, ఇక్కడ భావ వ్యక్తికరణ స్వేచ్ఛ అందరికీ ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి అని మహేష్ కత్తి అన్నారు.

ఇలాంటివి జరిగినపుడు హీరోలు ఎవరూ ఖండించరు. ఎందుకంటే వాళ్ల సేఫ్టీ వాళ్లకు ముఖ్యం. సినిమా ఓపెనింగ్స్ ముఖ్యం, ఫ్యాన్స్‌ను ఏమైనా అంటే రేపు ఓపెనింగ్స్ రావేమో అనే భయం, అందరూ ఇలా ఇన్ సెక్యూరిటీలో బ్రతుకుతున్నారు… అని మహేష్ కత్తి అన్నారు.