బాలయ్య సినిమాకు అది ప్లస్ అయితే.. చిరు సినిమాకు ఇది ప్లస్

0balakrishna-vs-chiranjeeviఈ ఏడాది సంక్రాంతికి కోడిపందాలు లేకపోవడంతో అందరూ సంక్రాంతి సినిమాలపై పందాలు కడుతున్నారు. ముఖ్యంగా అందరి దృష్టి ‘ఖైదీ నెంబర్‌ 150’, ‘గౌతమిపుత్రశాతకర్ణి’ సినిమాల మీదనే ఉంది. ఏది పెద్ద హిట్‌గా నిలుస్తుంది, ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు కొల్లగొడుతుంది అని లెక్కలు వేస్తున్నారు.

చారిత్రక సినిమా కావడంతోపాటు, తెలుగు వాడి కథ అన్న కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు ‘గౌతమిపుత్రశాతకర్ణి’ సినిమాకు పన్ను మినహాయింపును ప్రకటించాయి. దీంతో ఒక్క టిక్కెట్టుపై బాలయ్య సినిమా నిర్మాతలకు దాదాపు పది రూపాయల లాభం వస్తుంది. ఇది ‘గౌతమిపుత్ర..’ నిర్మాతలకు ఎంతో లాభం చేకూరుస్తుంది.

అలాగే ‘ఖైదీ నెంబర్‌ 150’కి కూడా ఓ వెసులుబాటు ఉంది. బాలకృష్ణ సినిమా కంటే ఈ సినిమా ఒక రోజు ముందుగా విడుదలవుతోంది. అంటే ఆ ఒక్కరోజూ థియేటర్లన్నింటిలోనూ ‘ఖైదీనెంబర్‌ 150’ మాత్రమే ప్రదర్శితమవుతుంది. దీంతో ఆ ఒక్కరోజే ఆ సినిమా పదికోట్ల రూపాయల వసూళ్లను రాబట్టగలిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇక, రెండో రోజు నుంచి ‘శాతకర్ణి’ సినిమాతో థియేటర్లను పంచుకోవాలి. కాగా, రెండు సినిమాలూ లాభదాయకంగా నిలవాలంటే ‘గౌతమిపుత్ర..’ 63 కోట్ల రూపాయలు, ‘ఖైదీనెంబర్‌ 150’ 90 కోట్ల రూపాయలను వసూలు చేయాల్సి ఉంటుంది.