మోడీకి అల్లుడు.. సోనియాకు కోడలు దొరికారా?

0రాజకీయ పార్టీలన్న తర్వాత ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ఏ అవకాశం దొరుకుతుందా? అని కళ్లు కాయలు కాయేలా ఎదురుచూస్తుంటారు. ప్రత్యర్థిని దెబ్బ తీయటానికి.. ఎటకారం చేసుకోవటానికి ఏ చిన్న అవకాశం లభించినా విడిచిపెట్టరు. అందులోకి ఎన్నికలు మరో ఏడాదికి వచ్చిన నేపథ్యంలో మైలేజీ విషయంలో ఎవరూ ఎవరి మాటా వినని పరిస్థితి.

తాము చెప్పేది లాజిక్ గా ఉన్నా లేకున్నా.. తాము చెప్పాల్సింది చెప్పేసే తీరు ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. అదివరకూ ఇలాంటి వాటిని ఫిల్టర్ చేసి సమాచారాన్ని అందించే మీడియా స్థానే.. దానికి రెట్టింపు బలమైన.. శక్తివంతమైన సోషల్ మీడియా ఎంట్రీ ఇవ్వటంతో రాజకీయ పార్టీలకు చేతినిండా పని దొరికినట్లైంది.

సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకొని తమ ప్రత్యర్థులకు చుక్కలు చూపించే పనిలో పడ్డారు నేతలు. అయితే.. ఈ ఉత్సాహం హద్దులు దాటి అత్యుత్సాహంగా మారటమే కాదు.. పార్టీ ప్రముఖుల్ని ఇబ్బంది పెట్టేందుకు అనవసరమైన అంశాల్ని తెర మీదకు తెచ్చేందుకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన దివ్యా స్పందన వ్యవహారమే దీనికి నిదర్శనంగా చెప్పాలి. ప్రధాని మోడీని ఉద్దేశించి మోడీజీ.. మీకు అల్లుడు దొరికారు అంటూ ట్వీట్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. దీనికి కౌంటర్ అన్నట్లు బీజేపీ సోషల్ మీడియా రంగంలోకి దిగి.. సోనియాగాంధీజీ మీకు కోడలు దొరికారంటూ మరో ట్వీట్ చేసి కొత్త తరహా వాదులాటను షురూ చేశారు.

నిజానికి ఈ ఇష్యూను చూసినప్పుడు దివ్యా కాస్త సెన్సిబుల్ గా వ్యవహరించారని చెప్పాలి. ఎందుకంటే.. ఆమె రాఖీసావంత్ కు చెందిన ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇటీవల ఫారిన్ ట్రిప్ లో ఉన్న రాఖీ సావంత్ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తనకు కాబోయే భర్త దొరికారంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో.. ఫ్రెండ్స్ నాకు కాబోయే భర్త ఎవరా? అంటూ అడుగుతారు కదా? ఇదిగో అతడిని కలవండి. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. అతడితో పాటు న్యూయార్క్ లో తిరుగుతున్నా. నా వీడియోనుప్రధాని మోడీతో సహా భారతీయులంతా చూస్తుంటారు. బాలీవుడ్ నటి అయిన కారణంగా మోడీ నాకు పెద్ద అభిమాని. ఇదిగోండి ఈయనే మీ అల్లుడు అంటూ రాఖీ పోస్ట్ చేశారు.

దీన్ని టైమ్లీగా దివ్య పోస్ట్ చేశారు. దీనికి ప్రతిగా బీజేపీ సోషల్ మీడియా విభాగం కాస్త చిల్లరగా రియాక్ట్ అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే.. ఈ వీడియో వారి తీరును తెలియజేసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలహాబాద్కు చెందిన ఒక మహిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన భర్త అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పెళ్లి చేసుకొని భార్య హోదా కల్పిస్తానని రాహుల్ తనకు చెప్పారని.. రోజూ ఆయన తన కలలోకి వచ్చి ఎన్నో ప్రామిస్ లు చేస్తుంటాడన్న వీడియోను బీజేపీకి చెందిన తేజీందర్ సింగ్ అనే వ్యక్తి పోస్ట్ చేశారు. ఇలా.. మోడీ.. సోనియమ్మలకు సంబంధం లేకుండానే అల్లుడు.. కోడలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు. మరి.. ఈ వీడియోల వార్ ఎక్కడి వరకూ వెళుతుందో చూడాలి.