పూనమ్ మేడమ్.. ఒకటే టాపిక్ ఎన్నాళ్లు?

0పూనమ్ కౌర్ కథానాయికగా కంటే… ట్విట్టర్ సెలబ్రెటీగానే బాగా ఫేమస్. చెప్పుకోవడానికి పుష్కర కాలం నుంచి టాలీవుడ్లో ఉంది కానీ.. ఆమె చేసినవన్నీ చిన్నా చితకా సినిమాలు. శ్రీకాంత్ మూవీ ‘మాయాజాలం’తో కథానాయికగా పరిచయం అయిన ఈ పంజాబీ భామ.. హీరోయిన్ గా కంటే ‘గగనం’.. ‘వినాయకుడు’ లాంటి సినిమాల్లో చేసిన స్పెషల్ రోల్స్ తోనే ఓ మోస్తరుగా పేరు తెచ్చుకుంది. కానీ అవి కూడా ఆమె కెరీర్ కు ఊపు తేలేకపోయాయి. చాలా ఏళ్ల కిందటే ఆమెకు అవకాశాలు ఆగిపోయాయి. ఏదో ఉన్నానంటే ఉన్నానన్నట్లు టాలీవుడ్లో కొనసాగుతోంది.

ఐతే ఈ మధ్య పవన్ కళ్యాణ్ తో ఆమె పేరు ముడిపడటం ద్వారా ఆమె వార్తల్లో నిలుస్తోంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ను పొగిడే పనిలో బిజీగా ఉన్న ఆమె.. గత కొంత కాలంగా ఆయన్ని ఉద్దేశించి పరోక్ష విమర్శలు – సెటైర్లు గుప్పించడం ద్వారా జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే పవన్ ఆప్త మిత్రుడైన త్రివిక్రమ్ ను కూడా పూనమ్ టార్గెట్ చేస్తున్నట్లుగా బలమైన అభిప్రాయాలున్నాయి. ఎక్కడా ఎవరి పేర్లూ వాడదు కానీ.. ఆమె వీళ్లిద్దరినే లక్ష్యంగా చేసుకుందన్న సంగతి స్పష్టమవుతూ ఉంటుంది. ముఖ్యంగా త్రివిక్రమ్ మీద ఆమె పంచులు క్లియర్ గా జనాలకు అర్థమవుతుంటాయి.

ఐతే ఏ టాపిక్ అయినా మాట్లాడటానికి ఒక సమయం సందర్భం ఉంటుంది. అది దాటిపోయాక ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు. ఎప్పుడో దశాబ్దం కిందట ‘జల్సా’ సినిమాలో పూనమ్ కు అవకాశం ఇస్తానని చెప్పి.. తర్వాత ఆమెకు త్రివిక్రమ్ హ్యాండ్ ఇచ్చాడన్నది ఇండస్ట్రీలో ఉన్న రూమర్. ఐతే పూనమ్ కు రావాల్సిన ఆఫర్ ను తన్నుకుపోయినట్లుగా భావిస్తున్న పార్వతి మెల్టన్ ‘జల్సా’తో ఏం బావుకుందో చూడాలి. ఆ పాత్రలో నటిస్తే పూనమ్ కెరీర్ మాత్రం మారిపోయేదా? ఏదో లైఫ్ టైం క్యారెక్టర్ మిస్సయిపోయినట్లు పదేళ్ల తర్వాత పూనమ్ తెగ ఫీలైపోవడం.. ఒకే టాపిక్ పట్టుకుని ఇన్ డైరెక్ట్ ట్వీట్లతో ఫాలోవర్లను విసిగించడం ఏమిటో అర్థం కావడం లేదు. ఏదైనా ఉంటే ఓపెన్ గా విషయం చెప్పాలి. సీక్రెట్లు బయటపెట్టాలి. కానీ ఎంతసేపూ ఒకే టాపిక్ పట్టుకుని వేలాడుతూ.. ఇన్ డైరెక్ట్ ట్వీట్లు గుప్పించడమేంటి? దీని మీద సోషల్ మీడియాలో డిస్కషన్లతో వినోదం చూడ్డమేంటి?