తొలి రోజు రికవరీ పది శాతమే

0

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘పేట’ తెలుగులో పెద్దగా హైప్ లేకుండా విడుదలైంది. ఈ సినిమాకు విడుదలకు ముందు సరైన ప్రమోషన్లు లేవు. అసలు రిలీజ్ కన్ఫమ్ కావడంలోనే చాలా జాప్యం జరగడం వల్ల జనాల్లో దీని మీద ఫోకస్సే లేదు. పైగా రజనీ గత సినిమాలు నిరాశ పరచడం కూడా దీనికి ప్రతికూలమైంది. ఈ పరిస్థితుల్లో ‘పేట’ డబ్బింగ్ హక్కులు కూడా రూ.15 కోట్లే పలికాయి. సూపర్ స్టార్ రేంజికి ఇది తక్కువ మొత్తమే. కానీ ఈ మొత్తం కూడా భారంగా మారిపోయే పరిస్థితి తలెత్తింది. సంక్రాంతికి ఆల్రెడీ మూడు భారీ చిత్రాలు షెడ్యూల్ కావడంతో ‘పేట’కు ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కలేదు. తొలి రోజు మాత్ం ఓ మోస్తరుగా స్క్రీన్లు ఇచ్చి రెండో రోజు నుంచి తగ్గించేశారు. ఇక ఈ చిత్రానికి తెలుగులో టాక్ కొంచెం అటు ఇటుగా వచ్చింది. చాలామంది పర్వాలేదు అన్నారు.

ఉన్నంతలో ఎక్కువ థియేటర్లు దొరికిన తొలి రోజు ‘పేట’ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.1.6 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ‘కబాలి’.. ‘2.0’ సినిమాలకు తొలి రోజు ఏపీ-తెలంగాణల్లో రూ.10 కోట్లకు పైగా షేర్ వచ్చింది. కానీ ‘పేట’ అందులో 20 శాతం కూడా రికవర్ చేయలేదు. నిర్మాత వల్లభనేని అశోక్ పెట్టిన పెట్టుబడిలో తొలి రోజు వెనక్కి వచ్చింది 10 శాతమే. అన్ని థియేటర్లు ఇచ్చి కూడా తొలి రోజు అంతే షేర్ రావడం ఆందోళన రేకెత్తించే విషయమే.

మరి స్క్రీన్లు బాగా తగ్గిపోయిన నేపథ్యంలో తర్వాతి రోజుల్లో షేర్ ఎలా ఉంటుందో చూడాలి. పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. శనివారం ‘ఎఫ్-2’ మంచి బజ్ మధ్య రిలీజవుతోంది. దీనికి పాజిటివ్ టాక్ వస్తే ‘పేట’కు కష్టమే. ‘వినయ విధేయ రామ’ టాక్ ఎలా ఉన్నా ప్రస్తుతానికి అది బాగానే ఆడుతోంది. ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’కు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి మున్ముందు వసూళ్లు పుంజుకుంటాయని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ‘పేట’కు స్క్రీన్లు పెంచినా అది ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందన్నదే సందేహం.
Please Read Disclaimer