దర్శనం మొగులయ్యకు పోసాని ఆర్థిక సహాయం

0posani-krishna-muraliవిషయమేదైనా సరే ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే వ్యక్తి పోసాని కృష్ణమురళి. అరుపు లాంటి మాటతో.. ఎదుటివాళ్లను కంగారెత్తించినా!.. కష్టాల్లో ఉన్నవాళ్లు ఎదురైతే మాత్రం ఆయన నిలువునా చలించిపోతారు.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యకు తాజాగా పోసాని దంపతులు రూ.25వేల ఆర్థిక సహాయం అందించారు. అంతేకాదు, భవిష్యత్తులో తిండికి, బట్టకు ఏ లోటు వచ్చినా.. ఆదుకునేందుకు తానెప్పుడూ సిద్దంగానే ఉంటానని భరోసా ఇచ్చారు.

ఓ ప్రముఖ టీవి చానెల్ మొగులయ్య ధీనస్థితి గురించి కథనాన్ని ప్రసారం చేయగా.. పోసాని వెంటనే స్పందించారు. టీవీ చానెల్ యాజమాన్యాన్ని సంప్రదించి.. వారి ద్వారా మొగులయ్యను కలుసుకున్నారు. మొగులయ్యను ఆప్యాయంగా పలకరించి ఆర్థిక సహాయం అందించారు.

మొగులయ్య పరిస్థితి గురించి తెలుసుకుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఆయనకు సహాయం అందిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. కళాకారులకు నిలయంగా ఉన్న ఫిలింనగర్ లో 500గజాల స్థలంలో మొగులయ్యకు ఇల్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మొగులయ్య లాంటి కళాకారులను ప్రోత్సహిస్తే.. అంతరించిపోతున్న కిన్నెర మెట్ల వాయిద్యాన్ని మరో 100మందికి నేర్పించగలరని అన్నారు.

కాగా, గతంలో 52దేశాల ప్రతినిధులను తన కిన్నెర వాయిద్యంతో ఉర్రూతలుగించారు మొగులయ్య. ఈరోజుల్లో 12మెట్ల కిన్నెర వాయిద్యంతో గానం చేస్తున్న ఒకే ఒక వ్యక్తి మొగులయ్య కావడం విశేషం. ఆయన తర్వాత ఆ కళ సజీవంగా బతికి ఉండాలంటే.. ప్రభుత్వం చొరవ చూపి కిన్నెర మెట్ల కళను బావితరాలకు అందించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.