పెదనాన్న కోసం డార్లింగ్!

0రెబెల్ స్టార్ గా గుర్తింపు ఉన్నా డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకున్నా బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ నట జీవితానికి పునాది పడింది మాత్రం పెదనాన్న కృష్ణంరాజు వల్లే అనేది కాదనలేని సత్యం. ఆయన అభిమానులు ప్రభాస్ లో వారసుడిని చూసుకోవడంతో ఈశ్వర్ తో మొదలైన ప్రభంజనం సాహో దాకా ఇంతింతై రీతిలో పెరుగుతూనే ఉంది. ప్రభాస్ ఇప్పటి దాకా ఎన్ని సినిమాలు చేసినా స్వతహాగా పెద్దన్న స్వంత బ్యానర్ గోపికృష్ణ మూవీస్ లో మాత్రం ఇప్పటి దాకా చేయలేదు. దానికి కారణం కృష్ణంరాజు గారు దాన్ని యాక్టివ్ గా ఉంచకపోవడమే. గతంలో ఒక్క అడుగు అనే టైటిల్ తో సినిమా భక్త కన్నప్ప రీమేక్ లాంటివి ప్రభాస్ తో చేయాలని తలచిన కృష్ణంరాజు గారు ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న సాధకబాధలు గుర్తించడంతో పాటు ప్రభాస్ ఇమేజ్ కి అవి సెట్ అవుతాయో లేదో అన్న మీమాంసలో ఆపేసారు. మళ్ళి ఇన్నాళ్లకు ఆయన పేరు ప్రొడక్షన్ లో కనిపిస్తోంది.

సాహో తర్వాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో యువి సంస్థతో పాటు గోపికృష్ణ బ్యానర్ కూడా అసోసియేట్ అయ్యింది. అంటే కృష్ణంరాజు గారికి కూడా భారీ మొత్తంలో పెట్టుబడితో లాభాలు ఉంటాయన్న మాట. ఎంత అనే మాట బయటికి రాలేదు కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ రేంజ్ వందల కోట్లకు చేరుకుంది కాబట్టి ఆ మొత్తం మధ్యస్థంగా ఉంటుంది అని కూడా చెప్పలేం. ఎక్కువ అనే పదమే సరైనది. ఒకరకంగా సినిమా నిర్మాణంలో స్థబ్దుగా ఉన్న కృష్ణంరాజు గారికి ఇది కొత్త ఎనర్జీ ఇస్తుంది. వ్యవహారాలన్నీ యువి సంస్థ చూసినా గోపికృష్ణ కూడా భాగమే కాబట్టి పరోక్షంగా ప్రభాస్ పెదనాన్న ప్రమేయం ఉంటుందన్న మాట. తన 20వ సినిమాకు ప్రభాస్ పెదనాన్న బ్యానర్ లో కనిపించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే ఓకే అయ్యింది.