ముంబైలో అమితాబ్.. హైదరాబాద్ లో ప్రభాస్!!

0ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాక్ స్టార్ బ్రయాన్ ఆడమ్స్ దాదాపు 7 సంవత్సరాల తర్వాత ఇండియాలో షో చేసేందుకు రాబోతున్నాడు. బ్రయాన్ షోలకు ఈవెంట్ సంస్థలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. రాక్ స్టార్ రాకపై అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. స్వయంగా బ్రయాన్ ఆడమ్స్ ట్విట్టర్ లో ఇండియాలో జరుగబోతున్న ఈవెంట్స్ గురించి ప్రకటించాడు. ఈసారి హైదరాబాద్ లో కూడా ఈయన షో ఉండబోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని సంగీత ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున హైటెక్స్ లో ఈయన షోకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వచ్చే నెలలో రాబోతున్న బ్రయాన్ ఆడమ్స్ కు ఇక్కడ సూపర్ స్టార్ లు ఘన స్వాగతం పలుకబోతున్నారు. అక్టోబర్ 9న అహ్మాదబాద్ లో మొదటి షోను బ్రయాన్ నిర్వహించబోతున్నాడు. ఆ తర్వాత రెండవ షోను అక్టోబర్ 11న హైదరాబాద్ లో – 12వ తారీకున ముంబయిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చక చక జరుగుతున్నట్లుగా ఆడమ్స్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇక హైదరాబాద్ మరియు ముంబయిల్లో ఈయన చేయబోతున్న షోలకు స్టార్ హీరోలు హోస్ట్ లుగా వ్యవహరించబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

హైదరాబాద్ లో ఈ రాక్ స్టార్ షోకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హోస్ట్ గా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. ‘బాహుబలి’తో ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకున్న ప్రభాస్ అయితే ఈ షోకు మంచి గుర్తింపు తీసుకు వస్తాడనే ఉద్దేశ్యంతో ఆయన్ను ఎంపిక చేసినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక ముంబయిలో జరుగబోతున్న ఈ రాక్ స్టార్ భారీ ఈవెంట్ కు బిగ్బి అమితా బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తాడు అంటూ సినీవర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ముంబయిలో జరుగబోతున్న షోకు బాలీవుడ్ తారలు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నాడు. ఏడు సంవత్సరాల తర్వాత బ్రయాన్ ఆడమ్స్ షోలు జరుగబోతున్న కారణంగా భారీ ఎత్తున అభిమానులు ఈ షోకు హాజరు అయ్యేందుకు ఉత్సాహంగా ఉన్నారు.