ప్రభాస్ అంత పెద్ద సినిమాను వద్దన్నాడట

0



‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ ఏ రేంజికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా ముందు వరకు అతను కేవలం ఒక తెలుగు స్టార్ హీరో. కానీ ‘బాహుబలి’ రెండు భాగాలతో అతడికి దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు వచ్చింది. అన్నిచోట్లా అతను స్టార్ అయిపోయాడు. ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్లు అతడితో సినిమా చేయడానికి క్యూలు కట్టారు. ప్రభాస్ తో సినిమా చేయాలని ఆశపడి నిరాశకు గురైన వాళ్లలో ‘బాహుబలి’ని హిందీలో రిలీజ్ చేసిన అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ సైతం ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు.. బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న సంజయ్ లీలా భన్సాలీ సైతం ప్రభాస్ తిరస్కారానికి గురయ్యాడట. ఈ విషయమై బాలీవుడ్లో ప్రస్తుతం ఒక వార్తల హల్ చల్ చేస్తోంది.

భన్సాలీ కెరీర్లో అత్యంత వివాదాస్పదం కావడమే కాక.. అత్యధిక వసూళ్లనూ సాధించిన ‘పద్మావత్’ సినిమాలో షాహిద్ కపూర్ పోషించిన రావల్ సింగ్ రాజ్ పుత్ పాత్ర కోసం ముందు ప్రభాస్ నే అడిగారట. కానీ ‘బాహుబలి’ కోసం ఐదేళ్లు కేటాయించిన ప్రభాస్.. మళ్లీ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కోసం ఇంకొన్నేళ్లు కేటాయించలేనని.. తాను మానసికంగా ఇలాంటి సినిమా చేసేందుకు సిద్ధంగా లేనని సున్నితంగా ఈ ఆఫర్ ను తిరస్కరించాడట. దీంతో భన్సాలీ చేసేది లేక ఆ పాత్ర కోసం షాహిద్ ను ఎంచుకున్నాడట. ఇప్పుడీ వార్త బాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. దీపికా పదుకొనే లాంటి స్టార్ హీరోయిన్ తో.. భన్సాలీ లాంటి అగ్ర దర్శకుడితో పని చేసే అవకాశాన్ని ఒక్క మాటతో ప్రభాస్ వదులుకోవడం అక్కడి వాళ్లకు మింగుడుపడటం లేదు. ఐతే ప్రభాస్ మాత్రం అప్పటికే కమిటైన ‘సాహో’ చిత్రాన్నే ‘బాహుబలి’ తర్వాత చేయాలని.. అది తనకు కొంచెం వైవిధ్యంగా ఉంటుందని భావించి ఆ సినిమానే మొదలుపెట్టాడు.