సాహో బ్రేక్ ముగింపుకొస్తోంది

0రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న సాహో ఇటీవలే దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కొంత టాకీ పార్ట్ షూట్ చేసిన దర్శకుడు సుజిత్ మిగిలిన భాగాన్ని హైదరాబాద్ లో మొదలుపెట్టబోతున్నాడు. ప్రస్తుతానికి చిన్న బ్రేక్ తీసుకున్న సాహో టీమ్ వచ్చే నెల నుంచి రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ తో యాక్టివ్ గా మారబోతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతున్న సాహో విడుదల విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. వచ్చే సమ్మర్ అంటున్నారు కానీ ఖచ్చితంగా ఫలానా డేట్ అనే అంచనాకు మాత్రం రాలేకపోతున్నారు. డార్లింగ్ ఫాన్స్ ని టెన్షన్ పెడుతున్న అంశం ఇదే. బాహుబలి తరహాలో ప్రభాస్ ప్రతి సినిమాకు ఇలా ఏళ్లకేళ్లు ఎదురు చూడలేమని వాపోతున్నారు. అయినా ఇక్కడ ప్రభాస్ ని అనడానికి కూడా లేదు – సబ్జెక్టుతో పాటు బడ్జెట్ కూడా డార్లింగ్ టైంని తినేస్తున్నాయి.

ఫిలిం సిటీలో తీయబోయే షెడ్యూల్ లో ఒక పాట కూడా ఉండవచ్చని తెలిసింది. మెయిన్ విలన్ గా నటిస్తున్న నీల్ నితీష్ తో పాటు జాకీ ష్రాఫ్ చుంకీ పాండే మందిరా బేడీ తదితరులంతా ఇందులో పాల్గొననున్నారు. సీజే వర్క్ కోసం ఐదు నెలల సమయం కేటాయించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. అది ఎలాగూ ఆలస్యం అవుతుంది కాబట్టే జిల్ దర్శకుడు రాధాకృష్ణతో గతంలో కమిట్ అయిన సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. కానీ ఎప్పుడు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ త్వరగా ఫినిష్ చేసి అదే ముందు విడుదల చేస్తారా అనే అనుమానం కూడా లేకపోలేదు. బాహుబలి తర్వాత 200 కోట్లకు తక్కువ కాకుండా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ ని మిర్చి లాంటి పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ లో మరోసారి చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. దానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది.