మొదటి ఛాన్స్ ఇలా వచ్చిందన్న ప్రభుదేవా

0ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరును దక్కించుకున్న ప్రభుదేవా నృత్య దర్శకుడిగా ఎంతటి సక్సెస్ ను దక్కించుకున్నాడో దర్శకుడిగా కూడా అదే స్థాయిలో సక్సెస్ లను దక్కించుకున్నాడు. డాన్స్ మాస్టర్ సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తున్న ప్రభుదేవాకు ఇంకా ఏదో చేయాలనే తపన ఉండేదట. ఆ సమయంలోనే నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి దర్శకుడిగా చేసే అవకాశం దక్కింది. వచ్చిన మొదటి అవకాశంను ప్రభుదేవా సద్వినియోగం చేసుకోవడంతో ప్రభుదేవా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.

తాజాగా దర్శకుడిగా తన తొలి సినిమా అవకాశంపై ప్రభుదేవా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘వర్షం’ చిత్రం కోసం నువ్వొస్తానంటే నేనొద్దంటానా పాటకు డాన్స్ కంపోజ్ చేస్తున్న సమయంలో నిర్మాత ఎంఎస్ రాజుగారు తన వద్దకు వచ్చి డైరెక్షన్ చేస్తావా – ఆసక్తి ఉందా అంటూ ప్రశ్నించారు. అంతకు ముందు నుండే నాలో దర్శకుడిని కావాలనే ఆసక్తి ఉంది – కాని ఎవరిని అడగాలన్నా కూడా మొహమాటంతో ఆ కోరికను నాలోనే దాచేసుకున్నాను. రాజుగారు అడిగిన వెంటనే ఆలోచన లేకుండా చేస్తా సార్ అనేశాను. ఆ కొద్ది కాలంకే ‘నువ్వొస్తానంటే నేను వద్దంటానా’ చిత్రం మొదలైంది.

మంచి కథతో తెరకెక్కిన ఆ చిత్రం తనకు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టిందని – తెలుగు సినిమా పరిశ్రమ నాకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చిందని – ఆ విషయాన్ని తాను ఎప్పటికి మర్చిపోను అంటూ ప్రభుదేవా చెప్పుకొచ్చాడు. తెలుగులో త్వరలో ఒక చిత్రానికి దర్శకత్వం చేయాలని కోరికగా ఉందని – అందుకోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. బాలీవుడ్ లో పలు వంద కోట్ల సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత ప్రభుదేవాకు దక్కింది. ఒకవైపు దర్శకుడిగా చేస్తూనే మరో వైపు నృత్య దర్శకుడిగా – నటుడిగా కూడా కొనసాగుతూ వస్తున్నాడు.