విష్ణుతో పాటు గాయపడిన నటి ప్రగ్యాజైశ్వాల్‌

0Pragya-Jaiswalotయువ కథానాయకుడు మంచు విష్ణుతో పాటు తానూ గాయపడినట్లు ప్రగ్యాజైశ్వాల్‌ తెలిపారు. విష్ణు కథానాయకుడిగా జి.నాగేశ్వరెడ్డి దర్శకత్వంలో ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం పది రోజుల క్రితమే మలేషియా వెళ్లింది చిత్ర బృందం. ఆదివారం యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్న సమయంలో మంచు విష్ణు మోటార్‌ సైకిల్‌పై నుంచి కింద పడిపోయారు. మెడ, భుజంపై గాయాలు కావడంతో ఆయన్ని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. విష్ణుతో పాటు బైక్‌పైన ఉన్న ప్రగ్యాజైశ్వాల్‌ కూడా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ ద్వారా తెలుపుతూ ‘జరిగిన ప్రమాదం గురించి తెలిసి స్పందించిన వారికి ధన్యవాదాలు. మంచు విష్ణు, నేనూ ఇద్దరం గాయపడ్డాం. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తా. షూటింగ్‌ షెడ్యూల్‌ అర్ధంతరంగా ముగియడంతో హైదరాబాద్‌ వచ్చేస్తున్నాం. మంచువిష్ణు త్వరలోనే మీతో మాట్లాడతారు’ అని ట్వీట్‌ చేశారు.