`ఎన్టీఆర్`లో ఆ ఇద్దరూ.. ఏ పాత్రల్లోనంటే?

0విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా తరాలు మారినా… తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెక్కు చెదరని స్థానం సంపాదించిన నటుడు ఎన్టీఆర్. ఆయన ప్రజాజీవితం కూడా సూపర్హిట్టే. ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. `ఎన్టీఆర్` పేరుతో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నందమూరి తారక రామారావుగా ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. ఈ చిత్రం కోసం బాలకృష్ణ నిర్మాతగా కూడా మారారు.

ఒక మల్టీస్టారర్ లాగా రూపొందే అవకాశాలు కనిపిస్తున్నారు. పలువురు యువ కథానాయకులు – కథానాయికలు ఈ చిత్రంలో కనిపిస్తారని సమాచారం. మహానటితో బయోపిక్ ల సత్తా ఏంటో తెలుగు సినిమా పరిశ్రమ రుచి చూసింది. అందుకే ఇలాంటి చిత్రాల్లో ఓ చిన్న పాత్ర చేసినా చాలనే అభిప్రాయంతో ఉన్నారు తారలు. అందుకే ఎన్టీఆర్ లో నటించేందుకు పలువురు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తాజాగా విజయ వాహిని స్టూడియో అధిపతి బి.నాగిరెడ్డి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించేందుకు అంగీకారం తెలిపారు. అలాగే ఎన్టీఆర్ కి కథానాయకుడిగా పల్లెటూరి పిల్లతో తొలి అవకాశాన్నిచ్చిన దర్శకుడు బి.ఎ. సుబ్బారావు పాత్రలో సీనియర్ నటుడు నరేష్ కనిపించబోతున్నారు. వీళ్లిద్దరిపై త్వరలోనే కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం. బి.నాగిరెడ్డిగా తాను నటిస్తున్న విషయాన్ని ప్రకాష్ రాజ్ కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.