ప్రకాష్ రాజ్.. రెండు లక్షలు తగ్గించాడు

0తెలుగులో కోట శ్రీనివాసరావు తర్వాత ఆ స్థాయిలో హవా సాగించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్ ప్రకాష్ రాజే. దశాబ్దంన్నర పాటు టాలీవుడ్లో ఆయన జోరు సాగింది. కానీ కొన్నేళ్ల కిందట్నుంచి ప్రకాష్ రాజ్ తగ్గుతూ వస్తోంది. ఒక దశలో తెలుగులో పూర్తిగా ఆయనకు అవకాశాలు ఆగిపోయినట్లే కనిపించింది. సేవా కార్యక్రమాల్లో.. రాజకీయ కార్యకలాపాల్లో బిజీ అయిపోయి నటనకు గుడ్ బై చెప్పేస్తున్నట్లు కనిపించాడు ప్రకాష్ రాజ్. కానీ ఈ మధ్య ఆయన మళ్లీ సినిమాల వైపు చూస్తున్నాడు. మంచి అవకాశాలు వస్తున్నాయి. ‘భరత్ అనే నేను’ లాంటి భారీ సినిమాలో కీలక పాత్రతో మెప్పించడంతో మళ్లీ టాలీవుడ్ ఫిలిం మేకర్స్ కళ్లు ఆయనపై పడ్డాయి. ఇప్పుడు మూణ్నాలుగు క్రేజీ ప్రాజెక్టుల్లో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. అందులో ‘శ్రీనివాస కళ్యాణం’ ఒకటి.

ఈ చిత్రం కోసం ప్రకాష్ రాజ్.. పారితోషకం తగ్గించుకుని నటించినట్లు సమాచారం. మామూలుగా ప్రకాష్ రాజ్ రోజుకు రూ.5 లక్షలు ఛార్జ్ చేస్తాడు. కానీ ఈ చిత్రానికి రోజుకు రూ.3 లక్షలే తీసుకున్నాడట. మొత్తం 20 రోజుల పాటు ప్రకాష్ రాజ్ సినిమాకు పని చేసినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా ఆయన రూ.60 లక్షలు పుచ్చుకున్నట్లన్నమాట. ఈ చిత్రంలో భారీ తారాగణం ఉండటంతో బడ్జెట్ ఎక్కువవుతుందని దిల్ రాజు చెప్పడంతో ప్రకాష్ రాజ్ తగ్గినట్లు తెలుస్తోంది. దిల్ రాజుతో ఉన్న అనుబంధం.. ఈ సినిమాపై ఉన్న ప్రత్యేక ప్రేమ వల్ల ఆయన పారితోషకం తగ్గించుకున్నట్లు చెబుతున్నారు. రాజు బేనర్లో ‘దిల్’ దగ్గర్నుంచి.. ఎన్నో సినిమాల్లో మరపురాని పాత్రలు చేశాడు ప్రకాష్ రాజ్. మధ్యలో వీళ్లిద్దరికీ కొంచెం తేడాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది కానీ.. తర్వాత ఇద్దరూ కలిసిపోయారంటారు.