మోదీపై ప్రకాశ్ రాజ్ ట్వీట్…వైరల్!

0ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యానంతరం బీజేపీ మోదీలపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కన్నడిగుడైన ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత …కర్ణాటకలో పాలనపై దృష్టిపెట్టాలంటూ కుమార స్వామి సర్కార్ కు సూచిస్తూ ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం కుమారస్వామికి ప్రధాని మోదీ ఫిట్ నెస్ చాలెంజ్ విసరడం….ఆ చాలెంజ్ కు కుమార స్వామి బదులివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ ఫిట్ నెస్ చాలెంజ్ విసరడంపై ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. మోదీపై సెటైరికల్ గా స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. పాలనపై దృష్టిపెట్టాలంటూ మోదీకి చురకలంటిస్తూ ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిరసన దీక్ష చేస్తోన్న సంగతి తెలిసిందే. కేజ్రీకి సంఘీభావం తెలిపేందుకు మమతా బెనర్జీ పినరాయి విజయన్ కుమార స్వామి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన విషయం విదితమే. ప్రస్తుతం కేజ్రీవాల్ కు దేశవ్యాప్తంగా మద్దతుగా పలువురు సెలబ్రిటీలు గళమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోలో తాజాగా మోదీపై ప్రకాశ్ రాజ్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యోగా ఫిట్ నెస్ చాలెంజ్ లతో మోదీ బిజీగా ఉన్నారని….అదే సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు అధికారులు సహకరించాలని సూచించాలని మోదీకి చురకలంటించారు. “డియర్ సుప్రీమ్ లీడర్….ఫిట్ నెస్ ఛాలెంజ్ – యోగా – ఎక్సర్ సైజులతో మీరు చాలా బిజీగా ఉన్నారని తెలుసు. అయితే ఒక్క క్షణం గుండెల నిండా ఊపిరి పీల్చుకొని – చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో కలిసి ప్రభుత్వ అధికారులు పనిచేయాలంటూ ఆదేశించండి. (కేజ్రీవాల్ మంచి పనులు చేస్తున్నారు). ఆ తర్వాత ఎక్సర్ సైజ్ తో పాటుగా మీ డ్యూటీని కూడా చేయండి” అంటూ ప్రకాశ్ రాజ్ చమత్కార ధోరణితో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ప్రకాశ్ రాజ్ ట్వీట్ పై మోదీ స్పందన ఏవిధంగా ఉంటుందో ఆసక్తికరంగా మారింది.