ప్రణీత సుభాష్ బాలీవుడ్ కెళ్లింది

0పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేదిలో కుందనాల్లాంటి కళ్లు తిప్పి.. బొంగరాలున్న జట్టు తిప్పి బాపుగారి బొమ్మ అనే టైటిల్ దక్కించేసుకుంది కన్నడ భామ ప్రణీత సుభాష్. ఆ తరవాత తెలుగులో బ్రహ్మోత్సవం సినిమాలోనూ కనిపించింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేయడంతో తిరిగి బెంగుళూరు వెళ్లిపోయింది.

అప్పుడప్పుడు కన్నడ సినిమాలు.. అవార్డు ఫంక్షన్లలో తళుక్కుమని మెరుస్తున్న ప్రణీత తాజాగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. కాకపోతే సినిమా హీరోయిన్ గా కాదు. ఫేమస్ ఆడియో కంపెనీ టి.సిరీస్ నిర్మించిన పాప్ ఆల్బమ్ లో ప్రణీత లీడ్ రోల్ లో కనిపించింది. చన్ కిత్తా గుజారి ఓయ్ అంటూ మెలోడియస్ గా సాగే ఈ సాంగ్ లో విక్కీడోనర్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రణీతకు జంటగా నటించాడు. ఇందులో ఆయుష్మాన్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా.. అతడి గర్ల్ ఫ్రెండ్ గా ప్రణీత కనిపించింది.

ప్రణీత ఇంతవరకు చేసినవన్నీ దాదాపుగా బబ్లీ రోల్స్. ఇందులో మాత్రం కాస్తంత విషాదం నిండిన ప్రేమికురాలిగా నీళ్లు నిండిన కళ్లతో కనిపిస్తుంది. ఈ పాట పాడింది కూడా ఆయుష్మాన్ ఖురానేయే కావడం విశేషం. రోచక్ కోహ్లీ ఈ పాటకు సంగీతం అందించాడు. బాలీవుడ్ లో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో వచ్చిన చమన్ సినిమాలో చన్ కిత్తా గుజారి ఓయ్ అంటూ హిట్ సాంగ్ ఉంది. మళ్లీ అదే టైటిల్ తో ఈ పాట రీమిక్స్ గా వచ్చింది.