పీకే కొత్త ప్లాన్… టీడీపీకి ఇక చుక్కలే!

0Jagan-and-Prashant-Kishorదివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా… నాడు విపక్షంలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వైఎస్ జమానాలో కీలక పదవులన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికే దక్కుతున్నాయని నాడు బాబు అండ్ కో గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. నాడు వైఎస్ కీలక పదవులిచ్చిన వారి జాబితాను విడుదల చేసి మరీ చంద్రబాబు కలకలం రేపారు. అయితే ఇప్పుడు నాడు బాబు అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు వైఎస్ కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ అస్త్రంగా మలుచుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. మూడున్నరేళ్ల క్రితం నవ్యాంధ్రలో పాలనా పగ్గాలను చేపట్టిన చంద్రబాబు తన సామాజిక వర్గం కమ్మ కులానికి చెందిన వారికే పదవులు కట్టబెడుతున్నారని మిగిలిన సామాజిక వర్గాలకు అసలు పదవులేమీ దక్కడం లేదని దక్కినా… ఒకటి అరా మినహా ఏమాత్రం ప్రయోజనం లేని పదవులే దక్కుతున్నాయన్నది ఇప్పుడు వైసీపీ వినిపిస్తున్న వాదనగా కనిపిస్తోంది.

నాడు బాబు అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు మరింత పక్కాగా పూర్తి ఆధారాలతో బయటకు తీయాలని వైసీపీ తీర్మానించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న నంద్యాల ఉప ఎన్నిక ఆ తర్వాత కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లభించిన విజయంతో టీడీపీతో ఉత్సాహం కనిపిస్తోంది. అదే సమయంలో గట్టి పోటీనిచ్చినా వైసీపీకి విజయం దక్కలేదు. దీనిపై ఓ సారి పరిశీలన చేసుకున్న వైసీపీ ఇప్పుడు ఈ బాబు అండ్ కో గతంలో అనుసరించిన వ్యూహాన్ని అస్త్రంగా మలచుకోవాలని చూస్తోందట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… వైసీపీ సలహాదారు ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహా మేరకు బాబు జమానాలో ఏ కులానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు? అప్పటిదాకా ఆయా స్థానాల్లో పనిచేస్తున్న ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఎందరిని తొలగించారు? వారి స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంతమందిని నియమించారు? ఈ తరహా నియామకాలు ఏఏ జిల్లాల్లో ఎంతమేర ఉన్నాయి? ఈ నియామకాల ద్వారా ఆయా జిల్లాల ప్రజలు సామాజిక వర్గాలు ఏమనుకుంటున్నాయి? అన్న కోణంలో సమగ్ర జాబితాను సేకరించే పనిని వైసీపీ ఎప్పుడో ప్రారంభించిందట.

నాటి వ్యూహంలో చంద్రబాబు అండ్ కో… ఎమ్మెల్యేలు మంత్రులు చైర్మన్లకే పరిమితమైతే ఇప్పుడు వైసీపీ ఇంకాస్త ముదుకెళ్లి… అసెంబ్లీ నుంచి వివిధ శాఖలకు చెందిన కన్సల్టెంట్లు ప్రభుత్వ ప్లీడర్లు అడ్వకేట్ జనరల్ స్టాండింగ్ కౌన్సిళ్ల వరకూ లెక్కలు తీసే పనిని ప్రారంభించిందట. రాష్ట్రంలో ఇప్పుడు అన్ని పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతూ మిగిలిన సామాజిక వర్గాలను పట్టించుకోవడం లేదని ఆయా సామాజిక వర్గాల దృష్టికి తీసుకు వెళ్లేందుకు కూడా వైసీపీ కసరత్తు ప్రారంభించిందట. ప్రధానంగా న్యాయ వ్యవస్థ విషయానికి వస్తే… అడ్వకేట్ జనరల్ గా ఉన్న వేణుగోపాల్ తో రాజీనామా చేయించడం ఆయన స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు ఇవ్వడం మొదలు… ఇప్పుడు పీపీలు స్టాండింగ్ కౌన్సిళ్ల సభ్యులుగా మెజారిటీ శాతం మళ్లీ అదే కులం వారిని కొనసాగిస్తున్నారని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే ఈ లెక్కలన్నీ తీశామని ఈ బాధ్యత తమ లీగల్ సెల్ ఇప్పటికే వేగంగా నిర్వహిస్తోందని తెలుస్తోంది.

ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో కీలకమైన పదవులు అధికారుల నియామకాలు అమరావతిలోని ఆ సామాజిక వర్గానికి చెందిన సంస్థలకు కేటాయించిన భూముల వివరాలు పోలీసు రెవెన్యూ మున్సిపల్ విద్యుత్ ఐటీ ఆర్ అండ్ వీ న్యాయ పంచాయతీరాజ్ శాఖల్లో ఇచ్చిన పోస్టింగులు కట్టబెట్టిన కాంట్రాక్టులను వైసీపీ సేకరించినట్లు సమాచారం. కోస్తాలో తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గ హవాకు మిగిలిన కులాలు నష్టపోతున్నాయన్న భావన అందరిలో ఉందని విజయవాడ గుంటూరులోనే కాదు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ అదే పరిస్థితి ఉందని ముఖ్యంగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలన్నీ చిత్తూరు జిల్లాకు చెందిన వారికే కట్టబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయని వాదన వినిపిస్తోంది. ఇందులో ముఖ్యమంత్రి బంధువు మిత్రుడి కంపెనీ కూడా ఒకటి ఉందని అన్ని దేవాలయాల సెక్యూరిటీ ప్రభుత్వ ఆసుపత్రుల ఉద్యోగ నియామకాలన్నీ ఆ కంపెనీకే ఇచ్చారని వైసీపీ నిగ్గు తేల్చినట్లు తెలుస్తోంది. గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని చాలా రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని ఇప్పుడు దీనిని ప్రజల దృష్టికి తీసుకు వెళ్లాల్సిందేనని వైసీపీ నేతలు భావిస్తున్నట్లుగా సమాచారం. ఇదే జరిగితే… టీడీపీకి గట్టి దెబ్బ తగలడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.