బిజెపితో పొత్తుపై జగన్ డైలమా: దీనిపై పీకే సర్వే

0Jagan-and-modiవచ్చే ఎన్నికల్లో బిజెపి – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు లేదా పరోక్ష ఒప్పందం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసిపి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దీనిపై సర్వే చేశారని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల నాటికి బిజెపితో పొత్తు లేదా అవగాహన కుదుర్చుకుంటే ఏఏ ప్రాంతం నుంచి ఎంతమంది టిడిపి నేతలు వైసిపి వైపు వస్తారు, అక్కడ పార్టీకి చెందిన నేతలు ఎలా పని చేస్తున్నారు, ఎవరినైనా మార్చాల్సి ఉందా అనే అంశాలపై ప్రశాంత్ కిషోర్ సర్వే చస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సర్వే బాధ్యతలను జగన్ అప్పగించడంతో ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారని తెలుస్తోంది.

పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో, నేతల్లో ప్లస్‌లు, మైనస్‌లపై సర్వే చేయడం, వాటికి అనుగుణంగా వచ్చే ఎన్నికల నాటికి ఏం చర్యలు తీసుకోవాలి, అభ్యర్థుల మార్పు తదితర అంశాలపై ప్రశాంత్ కిషోర్ దృష్టి సారించారు.

ప్రధానంగా బిజెపితో పొత్తు, టిడిపి నుంచి ఎవరెవరు చేరుతారు అనే అంశంపై ప్రశాంత్ కిషోర్ దృష్టి సారించారని తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత ఇద్దరు సభ్యులతో కూడిన ప్రశాంత్ కిషోర్ బృందం నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రముఖులతో సమావేశమవుతున్నాయి. వారి నుంచి వివరాలు తీసుకుంటోంది.

ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ప్రశాంత్ కిషోర్ బృందం సర్వే పూర్తి చేసిందని తెలుస్తోంది. సర్వేల్లో ఎవరైనా స్థానిక నాయకులు కలవకుంటే.. వారిని ఫోన్ ద్వారా సంప్రదించి సమాచారం తెలుసుకుంటున్నారని తెలుస్తోంది.

మీ నియోజకవర్గ ఇంచార్జ్ పని తీరు ఎలా ఉందని, అందుబాటులో ఉంటారా అని, జిల్లా నాయకత్వం ఎలా ఉందని.. ఇలా ప్రశ్నలు వేస్తున్నారని తెలుస్తోంది.

బిజెపితో పొత్తు పెట్టుకంటే ఎలా ఉంటుందని ఇప్పటి దాకా సర్వే చేసిన నియోజకవర్గాల్లో ప్రశ్నిస్తే బాగానే ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. బిజెపితో కలిస్తే మన పార్టీలోకి వచ్చే టిడిపి నేతల లిస్ట్ ఇవ్వాలని కూడా అడిగారని తెలుస్తోంది.