ప్రీతిజింటా పోస్టుతో నవ్వకుండా ఉండలేరు!

0సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు.. సినీ ప్రముఖుల్ని మరింత దగ్గరగా చూసుకునే వీలు వారిని అభిమానించే వారికి దక్కింది. అంతేకాదు.. తామేం చెప్పాలనుకున్నామో ఆ విషయాన్ని నేరుగా చెప్పే వెసులుబాటు లభించింది. గతంలో వారు చెప్పే విషయాల్నిప్రాధాన్యత క్రమంలో మీడియా సంస్థలకు ఉండే లెక్కల ఆధారంగా ఇచ్చేవారు. సోషల్ మీడియా ఎంట్రీతో ఆ హద్దులన్నీ చెరిగిపోయాయి.

వివిధ మాధ్యమాల్లో కొందరు సెలబ్రిటీలు యమా యాక్టివ్ గా ఉంటారు. అలాంటి వారిలో ప్రీతిజింటా ఒకరు. తాజాగా ఆమె షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. అయితే.. ఇది కాస్త పాత వీడియోనే అయినా.. ఆమె ఆ వీడియోకు అదనంగా జత చేసిన వ్యాఖ్య ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇంతకీ ఆమె పోస్టు చేసిన వీడియోలో ఏముందంటే.. రోడ్డు మీద బైక్ ట్రబుల్ ఇవ్వటంతో ఒక వ్యక్తి సీరియస్ గా బైకులో ఏం తేడా కొట్టిందన్న విషయాన్ని చెక్ చేస్తుంటాడు. అంతలో ఒక వ్యక్తి అతని వెనుక వచ్చి.. అటూ ఇటూ చూసి.. చాలా సింఫుల్ గా వెనుక జేబులో నుంచి పర్సు కొట్టేస్తాడు. తన దారిన తాను వెళ్లే క్రమంలో ఏదో అనుమానం వచ్చి ఆగిపోతాడు.

పైన చూస్తే.. సీసీ కెమేరా ఉంటుంది. తాను దొంగతనం చేసిన విషయం కెమేరాలో రికార్డు అయ్యిందన్న విషయాన్ని గుర్తించి.. క్షణాల పాటు ఆలోచించి.. ఆ వెంటనే పర్సు కింద పడేసి.. సదరు వ్యక్తిని పలుకరించి.. పర్సు కింద పడిన విషయాన్ని చెబుతాడు. సదరు బైక్ వ్యక్తి ఆ పర్సును తీసుకొని చెక్ చేసుకుంటాడు. అంతలో ఆ దొంగ గుట్టుగా నమస్కారం పెట్టి.. తన తప్పును మాఫీ చేయాలంటూ వేడుకోవటం కనిపిస్తుంది.

ఈ వీడియోను పోస్ట్ చేసిన ప్రీతి.. పైవాడు అన్ని చూస్తున్నాడు జాగ్రత్త అంటూ పోస్ట్ చేశారు. మైండ్ బ్లోయింగ్.. కాట్ ఆన్ కెమెరా అనే హ్యాష్ టాగ్స్ జత చేసి పోస్టు చేయగా.. అది కాస్తా విపరీతంగా వైరల్ అయ్యింది. దొంగ భలే బుక్కయ్యాడని కొందరు వ్యాఖ్యానిస్తే.. సీన్ రివర్స్ అయ్యిందంటూ మరికొందరు రీట్వీట్ చేశారు. భారీగా వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.సీరియస్ మూడ్లో ఉన్న వారి పెదాలపై నవ్వులు చిందేలా ఈ వైరల్ వీడియో చేస్తోంది.