మమ్మల్నే కాదు.. మగాళ్లను కూడా ‘వాడుకుంటారు’

0Priyanka-Chopra-Shines‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అంటూ స్టూడియోల చుట్టూ ఆశగా తిరిగే అప్కమింగ్ ఆర్టిస్టుల కథలు, వ్యధలు చాలానే విన్నాం.. వింటున్నాం. సినిమాల్లో ఎదగాలన్న తమ కలను పండించుకోవడం కోసం జీవితాలకు జీవితాలే ఖర్చుపెట్టుకునేవాళ్ళు కోకొల్లలు. ఒక్కోసారి సిగ్గొదిలిపెట్టి వళ్ళమ్ముకోవాల్సిన దురవస్థలు కూడా ఫిలిం నగర్లో కామన్. అలా.. పడగ్గదికి వస్తే తప్ప సినిమా ఛాన్సులు దక్కని నీచ సంస్కృతి ‘బ్లాక్ అండ్ వైట్’ రోజుల్నుంచి స్థిరపడిపోయింది. కానీ.. ఇటువంటి ‘క్యాస్టింగ్ కౌచ్’ కల్చర్ కి దొరికిపోయేది కేవలం ఆడాళ్లేనా? అంటే.. కానేకాదంటోంది బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ప్రియాంక చోప్రా. మగాళ్లను కూడా బెడ్రూమ్ కి పిలిపించుకున్న సందర్భాలున్నాయన్నది మిస్ పీసీ ఇచ్చిన ఇంట్రస్టింగ్ స్టేట్మెంట్.

పెంగ్విన్ యాన్యువల్ మీట్ డయాస్ మీద మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ పై తనదైన వెర్షన్ ని బయటపెట్టింది ప్రియాంక. ”మొదట్లో నేను కూడా ‘అటువంటి’ అసహ్యకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాను. కానీ నేనెక్కడా తగ్గలేదు. ఆవిధంగా ఒకసారి మంచి అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాను. మా అమ్మానాన్నలు గొప్ప ధనవంతులు కాకపోయినా నాకు మంచి విలువల్ని నేర్పారు. వాటిని కాపాడుకుంటూనే ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు ఇండియాలో టాప్ 10 సెలబ్రిటీల్లో గొప్పగొప్ప మగాళ్ల పక్కన నిలబడగలిగాను. ఈ ‘స్థాయి’కి రావడానికి ముందు చాలా మురికి గుంతల్ని దాటుకోవాల్సివచ్చింది” అంటూ తన గతాన్ని విప్పి చెప్పిందామె.

తాజాగా మరో సందర్భంలో కూడా పీసీ ‘క్యాస్టింగ్ కౌచ్’ సబ్జెక్టుని టచ్ చేసింది. ‘ఇండియాస్ నెక్స్ట్ సూపర్ స్టార్స్’ అనే టాలెంట్-హంట్ రియాలిటీ షో వేదిక మీద మాట్లాడుతూ.. ”క్యాస్టింగ్ కౌచ్ కష్టాల విషయంలో ఆడాళ్ళను మాత్రమే ఎందుకు ప్రస్తావిస్తారు..? మగాళ్లను ఎందుకు ప్రశ్నించరు? నాకు తెలిసి.. మగాళ్ళలో కూడా ‘పడగ్గది’ కష్టాలు అనుభవించినవాళ్ళు వున్నారు.” అంటూ గుట్టు విప్పింది ప్రియాంక. సో.. ఆడాళ్ళనే కాదు మగాళ్లను కూడా ‘వాడుకునే’ విచిత్రమైన సంస్కృతి మన సెల్యులాయిడ్ ఫీల్డ్ లో వుందన్నమాట.

సినిమా అవకాశాల ఎర చూపి ‘ఆడాళ్ళను వాడుకోవడంలో చెయ్యి తిరిగిన సెలబ్రిటీ’ అంటూ మొన్నీమధ్యే హాలీవుడ్ డైరెక్టర్ హార్వే వెయిన్ స్టెన్ పేరు రచ్చకెక్కింది. అతగాడి బారిన పడ్డ హీరోయిన్లు ఒక్కొక్కరుగా బైటికొచ్చి ఈ ‘క్యాస్టింగ్ కౌచ్’ దురాచారాన్ని ప్రపంచానికి మరోసారి పరిచయం చేశారు. ఇటువంటి మదమెక్కిన వెధవల్ని ఎండగడదాం రమ్మంటూ.. ‘మీటూ’ హాష్ టాగ్ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు ప్రియాంకా చోప్రా చెబుతున్న ‘మేల్ క్యాస్టింగ్ కౌచ్’ ముచ్చట ఈ సీజన్లో కాస్తంత కొత్తగా వుంది.