నేనా దర్శకత్వమా?: రాజు

0దిల్ రాజు తన కొత్త సినిమా శ్రీనివాస కళ్యాణం విషయంలో ఎందుకో కాస్త యాంగ్జైటీగా కనిపిస్తున్నారు. బాగా వచ్చిందన్న నమ్మకమో లేక తాను అనుకున్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి ఫలితం ఎలా ఉంటుందో అన్న టెన్షనో కానీ మాటల్లో బయట పడిపోతోంది. గత ఏడాది ఆరు సినిమాలు విడుదల చేసి దాదాపు అన్నింటితో సేఫ్ గా బయట పడిన దిల్ రాజు ఈ సంవత్సరం ఆరు నెలలు ఆలస్యంగా లవర్ తో ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఫస్ట్ బాల్ కే అవుట్ అయినట్టు తమ్ముడి కొడుకు పేరుని నిర్మాతగా పెట్టి చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కానీ శ్రీనివాస కళ్యాణం గురించి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు దిల్ రాజు. షూటింగ్ మొదలైనప్పటి నుంచి దీని మేకింగ్ లో దిల్ రాజు అంతా తానై వ్యవహరించారని తన ఆలోచనలకు అనుగుణంగా సినిమా తీయించుకున్నారని గత కొంత కాలంలో మీడియాలో గుప్పుమంటూనే ఉంది. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో తిరుమల దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు వచ్చిన ఐడియాను సతీష్ వేగ్నేశకు చెప్పి ఇది తీయించానని దిల్ రాజు చెప్పడం దీనికి కారణం.

ఇది కాస్త వేరే రకంగా ప్రచారం కావడంతో ఫైనల్ గా దిల్ రాజు ఓపెన్ అయిపోయారు. తాను ఇన్నేళ్ల కెరీర్ లో దర్శకుడి పనిలో ఏనాడూ తలదూర్చలేదని వాళ్ళ సృజనాత్మకతకు స్వేచ్ఛ ఇవ్వడంలో ముందుంటానని అయినా ఇవన్నీ మీడియా పుట్టించడం పట్ల విచారంగా ఉందని హర్ట్ అయ్యానని కూడా చెప్పారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండి నిజాలు మాత్రమే ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేసారు. సరే ఆయన చేసారో లేదో కానీ మొత్తానికి చాలా గట్టిగానే వార్త పాకిందని మాత్రం అర్థం చేసుకున్నట్టు ఉన్నారు. అయినా విజయం సాధించాక ఇవన్నీ చెబితే బాగుటుంది కానీ మీడియాలో ఏవేవో వార్తలు వచ్చాయని ఇప్పుడు వాటికి క్లారిటీ ఇవ్వడం కాదు సినిమా మాట్లాడితే బాగుంటుందేమో రాజు గారు.