8 గంటల పాటు సమ్మె… ఆ తర్వాత విరమణ

0parlament-medical-billదిల్లీ: వైద్య విద్యను ప్రక్షాళన చేయడానికి గానూ భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) స్థానంలో ‘జాతీయ వైద్య కమిషన్‌’ (ఎన్‌ఎంసీ) ఏర్పాటుకు ప్రతిపాదించిన బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించాలని లోక్‌సభ మంగళవారం నిర్ణయించింది. అధికార కూటమి సభ్యులు సైతం బిల్లును పరిశీలన నిమిత్తం స్థాయీసంఘానికి పంపించాలని కోరుకుంటున్న దృష్ట్యా ప్రభుత్వం దానికి అంగీకరిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్‌ ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి నూతన చట్టాన్ని సాధ్యమైనంత త్వరగా చేయాల్సి ఉన్న దృష్ట్యా సత్వరం నివేదిక వచ్చేలా చూడాలని సభాపతిని కోరారు. ఎన్‌ఎంసీపై ఇప్పటికే ఒక స్థాయీ సంఘం నివేదిక వచ్చినందున బడ్జెట్‌ సమావేశాల్లోపే తాజా నివేదిక సమర్పించాలని సభాపతి ఆదేశించారు.

8 గంటల పాటు సమ్మె… ఆ తర్వాత విరమణ

ఎన్‌ఎంసీ బిల్లుపై నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం నిర్వహించతలపెట్టిన 12 గంటల సమ్మెను ఐఎంఏ మధ్యలోనే విరమించుకుంది. ఈ బిల్లును స్థాయీ సంఘం పరిశీలనకు పంపించాలని లోక్‌సభ తీసుకున్న నిర్ణయం గురించి తెలిసిన వెంటనే వైద్యులు విధులకు హాజరయ్యేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. మొత్తంమీద 8 గంటల పాటు ఆసుపత్రుల్లో సేవలకు అంతరాయం కలిగినట్లయింది. స్థాయీ సంఘంలో విభిన్న రంగాలకు చెందిన సభ్యులు ఉంటారు కాబట్టి అక్కడ ఫలప్రదమైన చర్చ జరుగుతుందనే నమ్మకంతో ఆందోళనను విరమించినట్లు ఐఎంఏ మాజీ అధ్యక్షుడు కె.కె.అగర్వాల్‌ తెలిపారు.