డైలమాలో పురంధేశ్వరి !

0ఎన్టీఆర్ కూతురు చంద్రబాబు బద్ధ శత్రువు పురంధేశ్వరి పెద్ద డైలమాలో పడ్డారు. చాలా కాలం కాంగ్రెస్లో కీలక కేంద్ర మంత్రి పదవి స్థాయిలో ఉన్న ఆమె విభజన ఎఫెక్టుతో బీజేపీలో చేరారు. అయితే ఏపీలో బీజేపీ మరో రెండు టెర్ములు కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. పైగా రోజురోజుకు ఏపీలో బీజేపీపై ప్రజలకు కోపం పెరుగుతోంది. అయితే ఆంధ్రాకు కాంగ్రెస్ అన్యాయం చేసినపుడు కాంగ్రెస్లో ఉండి బీజేపీ అన్యాయం చేసినపుడు బీజేపీలో ఉండి… ఆమె పలువురికి సమాధానం చెప్పలేక ఇరుకనపడుతున్నారట. అసలే అధికారంలోకి రాని ఆ పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఆమె ఏ పదవులూ ఆశించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆమె వైఎస్సార్సీపీలోకి వెళ్తున్నట్టు వార్తలు వచ్చాయి.

నిజానికి పురంధేశ్వరికి వైసీపీ తెలివైన ఆప్షనే. ఎందుకంటే వైసీపీ ఏరోజు ఎన్టీఆర్ ను వ్యతిరేకించకపోగా గౌరవిస్తూ వచ్చింది. పైగా పురంధేశ్వరికి అస్సలు పడని చంద్రబాబుకు వైసీపీ బలమైన పోటీ. ఈ నేపథ్యంలో ఆమె వైసీపీలోకి వెళ్లడానికి కూడా ఒక దశలో ఆలోచించినట్టు తెలుస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో ఆమె పరిస్థితి ఏంటో… వైసీపీలో కూడా అలాగే ఉంది.

ఆమె ఇటీవలి వరకు కేంద్రంలో కీలక మంత్రి పదవిలో ఉన్నారు. ఒకవేళ వైసీపీలోకి వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయలేరు. ఎంపీగానే పోటీ చేయాలి. కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఆమె ఎంపీగా పోటీ చేస్తే ప్రస్తుతం ఉన్న వైసీపీ గాలిలో ఎన్టీఆర్ కూతురు అయిన ఆమె గెలిచే అవకాశాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుత అంచనాలన్నీ సరిగ్గా అనుకున్నట్లు జరిగితే వైసీపీ 2019లో జాతీయ పార్టీ అధికారాన్ని నిర్ణయించే స్థితిలో కూడా ఉండొచ్చు. అలాంటపుడు ఆమెకు రాబోయే ఎన్నికల అనంతరం వైసీపీ తరఫున కేంద్ర మంత్రి పదవి మరోసారి చేపట్టే అవకాశం ఉంది.

అయితే మరోవైపు బీజేపీలో కూడా ఆమెకు మంచి అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ ఈసారి ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తనకు కచ్చితంగా ఎంపీ టిక్కెట్ ఇస్తారు. ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నా… సరైన స్థానంలో పోటీ చేస్తే ఆమె గెలిచే అవకాశాలు లేకపోలేదు. పార్టీకి ఎంత వ్యతిరేకత ఉన్నా ఆమెకు బలమైన అనుచర వర్గం ఉంది. ఆర్థిక శక్తి ఉంది. అదృష్టవశాత్తూ గెలిస్తే ఏపీ తరఫున బీజేపీ నుంచి గెలిచిన వారిలో మంత్రి పదవికి ఆమె బెస్ట్ ఆప్షనే అవుతారు. ఆ విధంగా కూడా మరోసారి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఇంకోసారి పార్టీ మారిన ముద్ర వేయించుకోవడం కంటే కూడా బీజేపీలో ఉండి జాగ్రత్తగా వ్యవహరించి ఎన్నికల్లో కష్టపడి గెలిస్తే కచ్చితంగా పదవి వరించే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ మారకపోవడమే బెస్ట్ అని ఆమె భావిస్తున్నారు. ఇంకో కోణం ఏంటంటే… ఆమె బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి ఆశించారని వార్తలు వచ్చాయి. వాటిలో పూర్తి నిజం లేదు. ఎందుకంటే కమ్మ వర్గానికి అధ్యక్ష పదవి ఇచ్చే ఉద్దేశం బీజేపీకి లేదని ఆమెకు ఆల్రెడీ హింట్ ఇచ్చారు. కాబట్టి ఆమె ఎపుడో ఆశలు వదిలేసుకుంది. అందుకే పురంధేశ్వరి ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారే అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే ఆమె ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే… ఆమె పట్ల వైసీపీ సానుకూలంగా ఉండటమే దీనికి కారణం. ఎంతైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే ఆ కథే వేరు.