సక్సెస్ మీట్ అప్పుడే ఎలా ఫిక్స్ చేశారు?

0

నిన్న జరిగిన మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులకు మంచి జోష్ ఇచ్చింది. తమ హీరో సినిమాని ఇంకో వారం రోజుల్లో చూడబోతున్నామన్న ఉత్సాహం వాళ్ళలో బాగా కనిపిస్తోంది. నిన్న అతిధులతో పాటు నిర్మాతలు ఇచ్చిన స్పీచులు బాగానే ఉన్నప్పటికీ అందులో ప్రసాద్ వి పొట్లూరి గారి ఓ మాట మాత్రం అందరికి షాక్ ఇచ్చింది. అదే మే 18న జరగబోయే సక్సెస్ మీట్ గురించి.

ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. ఫలితం తెలియదు. నిర్మాతగా ఆయనకు దాని మీద నమ్మకం ఉండొచ్చుగాక. హీరో ఎవరైనా అన్ని బాగా ఆడాలనే పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాని ఫలితాలన్నీ మన చేతుల్లో ఉండవు. తీర్పు చెప్పాల్సింది ప్రేక్షకులు. వాళ్ళు డిసైడ్ చేసి ఇది బాగుంది అని వసూళ్ళ వర్షం కురిపిస్తే తప్ప బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవడానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మే 18 సక్సెస్ మీట్ అని చెప్పడం సాహసమే

ఇదిలా ఉండగా ఇంకా మధ్యాన్నం ఆట పడకుండానే సాయంత్రం సక్సెస్ మీట్ అంటూ హడావిడి చేస్తున్న నిర్మాతలు గత కొన్నేళ్ళలో లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయారు. ఒక్క షో పూర్తి కాగానే తమ సినిమా సూపర్ హిట్ అని చెప్పుకోవడానికి మీడియాని పిలిచి హడావిడి చేయడం మాములు విషయం అయిపోయింది. ఇందులో నిజమైన హిట్లు కొట్టిన సినిమాలు ఉన్నాయి తుస్సుమన్నవి కూడా ఉన్నాయి.

అదలా ఉంచితే ఇంత ముందుగా సక్సెస్ మీట్ డేట్ చెప్పారు అంటే మహర్షి గురించి ఎంతైనా ఊహించుకొండి అని క్లూ ఇచ్చినట్టెగా. అన్నట్టు ఈ సంగతి మహేష్ కు కూడా తెలియదట. బ్రహ్మోత్సవం నిర్మాతగా మహేష్ తో ఓ బ్యాడ్ మెమరీ ఉన్న ప్రసాద్ మహర్షితో అది పూర్తి మాసిపోయే రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి
Please Read Disclaimer