మహేష్ మూవీలోకి పీవీపీ ఎంట్రీ?

0మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాకు త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. సంక్రాంతి రిలీజ్ టార్గెట్ తో రూపొందనున్న ఈ సినిమాను.. దిల్ రాజు- అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పుడంటే నిర్మాతలుగా వీరిద్దరి పేర్లు కన్ఫాం అయ్యాయి కానీ.. మొదటగా ఈ ప్రాజెక్టు అనుకున్నపుడు నిర్మాత పీవీపీ.

ఆయన బ్యానర్ పై సినిమా చేసేందుకే వర్క్ జరిగింది. బ్రహ్మోత్సవం లాంటి బ్రహ్మాండమైన డిజాస్టర్ తర్వాత.. ఆ నష్టాలను భర్తీ చేసేందుకు డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితిలో.. అందుకు బదులుగా మరో సినిమా చేస్తానని మహేష్ మాట ఇవ్వడం.. అలా వంశీ పైడిపల్లి ప్రాజెక్టు మొదలవడం జరిగాయి. కానీ ఆ తర్వాత పీవీపీ ని సైడ్ చేసేసి.. దిల్ రాజు- అశ్వినీదత్ లు ఎంట్రీ ఇచ్చారు. దీనిపై పీవీపీ కోర్టుకు కూడా వెళ్లారు. దీనికి సంబంధించి దాదాపు అందరికీ.. అంటే మహేష్ బాబుకి కూడా నోటీసులు అందాయి. 2018లోగా పీవీపీకి మహేష్ ఓ సినిమా చేయాలన్నది అగ్రిమెంట్.

ఇవన్నీ సెటిల్ చేసుకునేందుకు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే సినిమాలోకి పీవీపీ ని కూడా నిర్మాణ భాగస్వామిగా తీసుకునే యోచన చేస్తున్నారట. తద్వారా కోర్టు కేసుల విషయంలో కూడా సెటిల్మెంట్ అవుతుందని.. కోర్టుకు హాజరు కావాల్సిన పని తప్పుతుందని.. అలాగే పీవీపీతో ఉన్న అగ్రిమెంట్ ను పాటించినట్లు అవుతుందని మహేష్ అండ్ టీం ఆలోచిస్తున్నట్లు అంటున్నారు. కాకపోతే పీవీపీ నేరుగా నిర్మాతగా ఉంటారా.. లేక స్లీపింగ్ పార్ట్నర్ గా వ్యవహరిస్తారా అన్నదే తేలాలి.