క్వీన్ అన్నంత పనీ చేసింది!

0

2019 జనవరిలో రిపబ్లిక్ డే కానుకగా `మణికర్ణిక` చిత్రాన్ని రిలీజ్ చేస్తామని కంగన టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వారియర్ క్వీన్ ఝాన్సీ రాణి పాత్రలో కంగన తడాఖా చూపించనుంది. ఈ పాత్ర కోసం ఎంతో రిస్క్ చేసి కత్తి యుద్ధాలు గుర్రపు స్వారీ వంటి విద్యల్ని నేర్చుకుంది. షూటింగ్ జరిగేప్పుడు జరిగిన ఓ ప్రమాదం వల్ల దాదాపు ప్రాణాలు పోగొట్టుకునే వరకూ వెళ్లింది. ఒకానొక దశలో ఆన్ లొకేషన్ జరిగిన ఓ ప్రమాదం నుంచి బయటపడి అదృష్టవశాత్తూ కంగన బతికి బట్ట కట్టిందన్న వార్తలు వచ్చాయి. ఇంతా జరిగాక.. ఇక చిత్రీకరణ ముగుస్తోంది అనగానే అసలు కథ మొదలైంది. దర్శకుడు క్రిష్‌తో కంగన వివాదం ముదిరిపాకాన పడింది. దీంతో క్రిష్ మధ్యలోనే ఆ ప్రాజెక్టును వదిలేసి హైదరాబాద్‌కి వచ్చేశారు. ఇక్కడ బాలకృష్ణ నిర్మిస్తున్న `ఎన్టీఆర్` బయోపిక్‌తో బిజీ అయిపోయారు. ఆ క్రమంలోనే కంగన నిర్మాతలతోనూ విభేధించిందని సోనూ సూద్తోనూ గొడవ పెట్టుకుందని ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో వివాదాలపై ఆసక్తికర చర్చ సాగింది.

కట్ చేస్తే.. వన్ ఫైన్ డే.. ఎవరు దర్శకత్వం వహించినా వహించకపోయినా ఆగేది లేదు. `నాకు నేనే డైరెక్టర్!` అంటూ బ్యాలెన్స్ చిత్రీకరణను కంగన ప్రారంభించి డేర్ చూపించింది. క్లాప్ బోర్డ్ పై కంగన దర్శకత్వం అని ప్రదర్శించి ప్రత్యర్థికి షాకిచ్చింది. మొత్తానికి సినిమా ఇప్పటికి పూర్తయింది. నిర్మాతలు కంగనతో రాజీకొచ్చి సినిమా పూర్తి చేశారు. మణికర్ణికను ముందే ప్రకటించిన తేదీ ప్రకారమే రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ నర్మద ఘాట్‌లో ఈ పాట చిత్రీకరణ పూర్తి చేశారని తెలిసింది. ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేశామని తాజాగా కంగన బృందం ప్రకటించింది. ఆన్ లొకేషన్ ముగింపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఓ గ్రూప్ ఫోటోని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో హమ్మయ్య! అనుకున్నారంతా.

ప్రథమ స్వాతంత్య్ర సమరంలో ఆంగ్లేయులను ఎదిరించి పోరాడిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్రలో కంగనా ఎలా నటించిందో చూడాలన్న ఉత్సాహం అభిమానుల్లో ఉంది. పెద్ద తెరపై వీరనారి ఎలానో `మీటూ-ఇండియా` ఉద్యమం పేరుతో పురుషాధిక్య ప్రపంచంపై కసి తీర్చుకుంటున్న కంగన.. పురుష ప్రపంచంలోని లూప్ హోల్స్ వెతుకుతూ ఆటాడుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంతకీ `మణికర్ణిక` టైటిల్ కార్డ్స్‌లో ఎవరి పేరు ఉంటుందో? ట్రైలర్లో మాత్రం క్రిష్ పేరు వేసి గౌరవించింది కాబట్టి థియేటర్లలోనూ ఖాయంగా క్రిష్ పేరు చూడొచ్చన్నమాట!
Please Read Disclaimer