రాగాల వెంకట రాహుల్ తెలుగుజాతి కీర్తి పతాకాన్ని విశ్వవ్యాప్తం చేశారు: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర

0కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిప్టింగ్ 85 కేజీల విభాగంలో స్వర్ణ పథకం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట రాహుల్ కు ఏపీ క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు తెలిపారు. స్వర్ణ పథకం సాధించిన వెంకట రాహుల్ గుంటూరు జిల్లా స్టూవర్టుపురానికి చెందిన రాగాల మధు కుమారుడని, వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వెంకట రాహుల్ గోల్డ్ మెడల్ సాధించటం గర్వించదగ్గ విషయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 85 కేజీల విభాగంలో 187 కేజీల బరువు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించిన రాగాల వెంకట రాహుల్ కు రాష్ట్ర ప్రభుత్వం గతంలో పోత్సాహం అందించి ప్రోత్సహించిందని, ముఖ్యమంత్రితో చర్చించి రాహుల్‌కు భవిష్యత్తులోను అన్ని విధాల సాయం అందిస్తామని తెలిపారు.

రాగాల వెంకట రాహుల్ తెలుగుజాతి కీర్తి పతాకాన్ని విశ్వవ్యాప్తం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వెంకట రాహుల్ ను ఆదర్శంగా తీసుకోని క్రీడలలో భవిష్యత్ తరాలు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఆస్ట్రేలియాలోని క్వీన్ లాండ్స్ రాష్ట్రంలో గోల్డ్ కోస్టు సిటీలో కామన్ వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయని అన్నారు. గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్నందున ఈ క్రీడలను గోల్డ్ కోస్ట్ 2018 గేమ్స్ గా పిలుస్తున్నారని అన్నారు. అప్పట్లో బ్రిటీష్ పాలనలో ఉన్న మొత్తం దేశాలతో పాటు, ఇటీవల ఈ క్రీడలలో పాల్గొనేందుకు ముందుకొచ్చిన మరికొన్ని దేశాలతో కలిపి, మొత్తం 70 పైగా దేశాలకు చెందిన 6600 మంది క్రీడాకారులు కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు.

ఈ నెల 4వ తేది నుండి 15వరకు జరిగే ఈ క్రీడలలో ఇప్పటివరకు భారత్‌ మొత్తం నాలుగు బంగారు పథకాలు సాధించిందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాగాల వెంకట రాహుల్ రానున్న ఒలింపింక్స్ లోనూ గోల్డ్ మెడల్ సాధించి ఆంధ్రుల ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా ఉన్నత స్థానానికి చేర్చుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలుగువారు అందులో ఆంధ్రులు పౌరుషం, పట్టుదల, ప్రతిభలోను దేశంలో ఏ ఒక్కరికి తీసిపోరన్న విషయాన్ని రాహుల్ తన కృషి, కఠోర దీక్షతో ప్రతిభను చాటి మరోమారు నిరూపించారని మంత్రి వ్యాఖ్యానించారు.