‘సైరా’ కి అలా పంచ్ పడనుందా?

0మెగాస్టార్ చిరంజీవి కెరీర్ 151వ సినిమా `సైరా-నరసింహారెడ్డి` చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 200కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు డెడ్ లైన్ ప్రకారం యూనిట్ పని చేస్తోంది.

అయితే `సైరా`కి ఊహించని ఆటంకం ఎదురు కానుందన్నది తాజ అప్ డేట్. సీఎం కేసీఆర్ ముందస్తు ఆలోచనతో ఓవైపు తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయ్. ఈ సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకునే పనిలో ఉంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని గద్దె దించడమే ధ్యేయంగా అన్ని పార్టీల్ని కలుపుకుపోతోంది. తేదేపా – సీపీఎం – సీపీఐ – టీజేఎస్ వంటి పార్టీల్ని కలుపుకుని భారీ ప్లానింగుతో ఉంది. ఇక ఈ అలయన్స్ కి మెగాస్టార్ లాంటి సినీగ్లామర్ తోడు అవసరం అని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారట. ఈ పరిణామం సైరాకి ఇబ్బందికరమేనని భావిస్తున్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే స్వయంగా చిరుకి ఫోన్ చేసి సాయం అర్థిస్తే కాదనగలరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ క్రమంలోనే చిరుకి ఇరకాటం తప్పదని కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాలకు రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే చిరు మాత్రం రాజకీయాల్ని పూర్తిగా దూరం పెట్టి – తన పనిలో తాను ఉన్నారు. సైరా చిత్రాన్ని బంపర్ హిట్ చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నారు. ఈ ఎన్నికల బరిలో చిరు ప్రచారానికి వస్తారా.. రారా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. సన్నివేశాన్ని బట్టి ఆయన బరిలో దిగొచ్చు.. దిగకపోనూ వచ్చు. మొత్తానికి కేసీఆర్ ముందస్తు సెగ `సైరా`ను తాకడం మెగాభిమానుల్లో చర్చకొచ్చింది. చిరు ఎస్కేప్ ప్లాన్ లో ఉన్నారా .. లేక పార్టీని ఆదుకుంటారా? అంటూ టీ- కాంగ్రెస్ లో చర్చ సాగుతోంది.