మొన్న నిర్మాత-హీరో.. ఈ రోజు ప్రత్యర్థులు

0ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం కంటే దాన్ని సరైన సమయంలో రిలీజ్ చేసుకోవడం పెద్ద విషయం అయిపోయింది. సినిమాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుండగా.. మరోవైపు ఒకే ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలొచ్చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో చాలామంది మధ్య సన్నిహిత సంబంధాలుంటాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర స్నేహితులు… బంధువులే ప్రత్యర్థులుగా మారుతుంటారు. ఈ ఫిబ్రవరిలో మెగా ఫ్యామిలీ హీరోలు వరుణ్ తేజ్.. సాయిధరమ్ తేజ్ బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమ గత సినిమాకు కలిసి పని చేసిన ఇద్దరు వ్యక్తులు ఈ శుక్రవారం వేర్వేరు సినిమాలతో తలపడబోతున్నారు. ఆ ఇద్దరూ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున.. యువ కథానాయకుడు రాజ్ తరుణ్.

సంక్రాంతికి విడుదలైన రాజ్ తరుణ్ చివరి సినిమా ‘రంగుల రాట్నం’కు నాగార్జునే నిర్మాత అన్న సంగతి తెలిసిందే. అసలు ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో రాజ్ ను హీరోగా పరిచయం చేసిన నిర్మాత కూడా నాగార్జునే. ఈ రకంగా నాగార్జునను రాజ్ కు గాడ్ ఫాదర్ అని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తితో బాక్సాఫీస్ సమరానికి రెడీ అయ్యాడు రాజ్. కానీ తప్పట్లేదు. నిజానికి ఇందులో అతడి తప్పేమీ లేదు. ‘రాజు గాడు’ను చాలా ముందే జూన్ 1కి ఫిక్స్ చేశారు. కానీ మే 25నే రావాల్సిన ‘ఆఫీసర్’ అనుకోకుండా వచ్చి దానికి పోటీగా మారింది. తన సినిమా విడుదల తేదీని మార్చడం రాజ్ చేతుల్లో లేదు. అందుకే సైలెంటుగా ఉండిపోయాడు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది దేనిపై పైచేయి సాధిస్తుందో చూడాలి. ఈ రెంటికి తోడుగా విశాల్-సమంత జంటగా నటించిన తమిళ డబ్బింగ్ మూవీ ‘అభిమన్యుడు’ కూడా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.