అదే త్రివిక్రమ్ డేరింగ్ స్టెప్!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన `అరవింద సమేత` బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 30కోట్లు పైగా వసూలు చేసింది. ఈ విజయం నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. తొలి వీకెండ్ – తొలి వారం (7రోజుల) నాటికి ఈ సినిమా భారీ కల్లెక్షన్స్ సాధిస్తుందన్న అంచనాలేర్పడ్డాయి. ఎలానూ దసరా సెలవులు కలిసిరానున్నాయి కాబట్టి ఈ సినిమాకి ఆ మేరకు కలెక్షన్స్ పెరుగుతాయే కానీ తగ్గే ఛాన్సే లేదు.

ముఖ్యంగా ఈ చిత్రంలో తారక్ నటనకు చక్కని పేరొచ్చింది. ఓ ఎమోషనల్ యాక్షన్ డ్రామాని త్రివిక్రమ్ తీర్చిదిద్దిన తీరును ప్రశంసిస్తున్నారు. సినీసెలబ్రిటీల నుంచి సామాజిక మాధ్యమాల్లో బోలెడన్ని ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం చూసిన దర్శకధీరుడు రాజమౌళి టీమ్ ని అభినందించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ప్రతిభను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.

“యుద్ధం ముగిసిన తర్వాత ఏం జరుగుతుంది? అనే పాయింట్ ని బేస్ చేసుకొని సినిమాను ప్రారంభించడమే త్రివిక్రమ్ డేరింగ్ స్టెప్. చాలా బాగా తెరకెక్కించాడు. ఆ సన్నివేశాల్లో తారక్ ప్రదర్శించిన అభినయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జగపతిబాబు నటన అద్భుతంగా ఉంది“ అని ట్వీట్ లో పేర్కొన్నారు జక్కన్న. రాజమౌళి ప్రశంసలతో వీరరాఘవునికి మరింత ఆదరణ పెరుగుతుందనడంలో సందేహం లేదు. తదుపరి అతడు తెరకెక్కించనున్న `ఆర్.ఆర్.ఆర్` చిత్రంలో తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Please Read Disclaimer