#Rల గోలేంటో నాయనో!!

0



ఏ క్షణాన తన మరుసటి చిత్రాన్ని #RRR అంటూ రాజమౌళి ఓ హ్యాష్ ట్యాగ్ తో ప్రకటించాడో కానీ.. అక్కడి నుంచి జనాలు తమ క్రియేటివిటీ అంతా ప్రదర్శిస్తూనే ఉన్నారు. కొన్నేళ్ల క్రితం వరకూ సినిమా న్యూస్ అంటే.. వాటికి సంబంధించిన రిపోర్టింగ్(R) మాత్రమే ఉంది. ఆ తర్వాత రివ్యూలు(R) మొదలయ్యాయి. ఆ తర్వాత విశ్లేషణలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి.

కానీ ఇప్పుడు ఎక్స్ క్లూజివ్ అప్ డేట్లు.. లేటెస్ట్ న్యూస్ లు.. తాజా సమాచారాలు బాగా పెరిగిపోయాయి. ఒకళ్లు వేస్తే చాలు అందరూ అదే పట్టుకుని వేళ్లాడుతున్నారు. ఇప్పుడు రాజమౌళి మూవీ విషయంలో కూడా #R సంగతి ఇలాగే ఉంది. ఏ రకంగా ఆర్ అనే అక్షరాన్ని లింక్ చేసేందుకు అవకాశం ఉన్నా.. కలిపేసి పులిహోరలు.. దద్ధోజనాలు వండేస్తున్నారు. తన సినిమాకు మూడు ఆర్ లు ఎందుకు తగిలించాడో రాజమౌళి క్లియర్ కట్ గానే చెప్పాడు. ఆ తర్వాత రాజశేఖర్ లాంటి ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ల పేర్లు వినిపించాయి. ఇప్పుడు లేటెస్ట్ ఎడిషన్ ఏంటంటే.. ఈ సినిమా అంతా రెయిన్(R) థీమ్ తో నడుస్తుందట.

అంటే సినిమా అంతా వర్షం కురుస్తూనే ఉంటుందట. రాజమౌళి #R పెట్టడం వెనుక ఈ వర్షం కాన్సెప్ట్ కూడా ఉందట. ఇందులో నిజానిజాలు ఎంతవరకూ ఉన్నాయో కానీ.. జనాలు మాత్రం #Rల గోలేంటి బాబూ అనుకుంటున్నారు. అతి సర్వత్ర వర్జయేత్ అని సామెత ఉంది. తినగా తినగా వేము తియ్యగా ఉంటుందేమో కానీ.. వినగా వినగా రూమర్లు మాత్రం విసుగు విరక్తి పుట్టించేస్తాయి.