మహానటిలో రాజేంద్రుడి వేషం

0రేపు విడుదల కానున్న మహానటి విశేషాలు ఒక్కొక్కటిగా బయటికి వదులుతున్నారు. ఈమధ్య కాలంలో ట్రైలర్ విడుదల కాని ఇండియన్ సినిమా ఇదే అన్నా ఆశ్చర్యం లేదు. కాని పబ్లిసిటీలో భాగంగా అందులో నటించిన కీలక నటీనటులకు సంబంధించిన స్టిల్స్ ని వివరాలతో సహా విడుదల చేయటం ఆసక్తిని అంతకంతకు పెంచుతోంది. మూడు గంటల్లో సావిత్రి గారి జీవితాన్ని నాగ అశ్విన్ ఆవిష్కరించిన తీరుని చూడాలని సగటు ప్రతి సినిమా ప్రేమికుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇక ఇందులో భారీ స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ ఎవరికి ఏ పాత్ర ఎంతవరకు సూట్ అవుతుందో పక్కా స్కెచ్ తో ప్లాన్ చేసుకుని వాడుకున్న నాగ అశ్విన్ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కు ఇచ్చిన రోల్ ఏమై ఉంటుందా అనే అనుమానం అందరికి కలిగింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రస్థానాన్ని మహా దివ్యంగా కొనసాగిస్తున్న రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి రోల్ ఇచ్చుంటారా అనే సస్పెన్స్ కు తెరపడిపోయింది.

ఇందులో రాజేంద్ర ప్రసాద్ సావిత్రి గారి పెదనాన్న కెవి చౌదరి గారి వేషం వేస్తున్నారు. సావిత్రి గారి సినిమా జీవితంలో ఆమె వెన్నంటే ఉండి తన ఎదుగుదలకు తోడ్పడిన పాత్రలో రాజేంద్రుడు సినిమా కీలక భాగం అంతా కనిపిస్తారట. ఆవిడకు వ్యక్తిగత సహాయకుడిగానే కాక పలు సందర్భాల్లో డ్రైవర్ కుడా ఉండేందుకు వెనుకడలేదని చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సో రాజేంద్ర ప్రసాద్ కు దక్కింది చిన్న పాత్ర కాదు అనే క్లారిటీ వచ్చినట్టే. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించిన మహానటిపై ఇలాంటి అప్ డేట్స్ వల్ల అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సమంతా జర్నలిస్ట్ గా విజయ దేవరకొండ ఫోటో గ్రాఫర్ గా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీలో ఇంకా సర్ ప్రైజ్ అనిపించే పాత్రలు చాలానే ఉన్నాయట. అవన్నీ స్క్రీన్ మీద చూసి థ్రిల్ అవ్వాల్సిందే అంటున్నారు వైజయంతి టీం. రేపు ఉదయం ప్రారంభం కాబోతున్న వెండితెర మహారాణి వైభవం ఎలా ఉంటుందో తెలియడానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది