రాజకీయాలపై రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు

0Rajini-Political-Entryతమిళనాడులోని చెన్నైలో ప్రముఖ సినీనటుడు శివాజీ గణేశన్‌ స్మారక కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ ఒకే వేదికపై తళుక్కుమన్నారు. ఈ సందర్భంగా రాజకీయాలపై రజనీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో విజయం సాధించాలంటే కీర్తిప్రతిష్టలు, ధనం మాత్రమే ఉంటే సరిపోదన్నారు. ఇంకేదో కావాలన్నారు.

‘రాజకీయ నాయకుడిగా విజయం సాధించాలంటే ఇప్పుడున్న కీర్తి ప్రతిష్టలు సరిపోవు. ఇంకా ఎక్కువ కావాలి. నాకు ఆ రహస్యం తెలీదు. బహుశా కమల్‌కు తెలుసని భావిస్తున్నా. గత రెండు నెలల క్రితమే కమల్‌ తనతో కలిసి పనిచేయాలని నన్ను అడిగి ఉండాల్సింది.’ అని అన్నారు. ‘రాజకీయాల్లో ఎలా విజయం సాధించాలని నేను కమల్‌ను అడిగాను. నాతో రా.. నేను చెబుతాను.’ అని కమల్‌ చెప్పినట్లు రజనీ అన్నారు. ఈ స్మారక కేంద్రాన్ని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ప్రారంభించారు.

తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ స్టార్‌ నటులిద్దరూ రాజకీయాల్లో రంగ ప్రవేశం చేస్తామని ప్రకటించడంతో రాజకీయ నాయకులు, ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.