సౌందర్యకు విడాకులు మంజూరు

0soundarya-appears-in-courtరజనీకాంత్‌ కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్‌కు చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టు మంగళవారం విడాకులు మంజూరుచేస్తూ తీర్పు వెల్లడించింది. రజనీకాంత్‌ రెండవ కూతురు సౌందర్యకు 2010లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అశ్విన్‌ రామ్‌కుమార్‌తో వివాహం జరిగింది. నాలుగేళ్ల పాటు వీరి సంసార జీవితం సాఫీగానే జరిగింది. 2015లో సౌందర్య, అశ్విన్‌ రామ్‌కుమార్‌ దంపతులకు ఒక మగబిడ్డ పుట్టాడు. బిడ్డకు వేద్‌ అని పేరు పెట్టారు. ఆ బాబు తొలి పుట్టిన వేడుక సందర్భంలోనే అశ్విన్‌రామ్‌కుమార్, సౌందర్య మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరిగింది.

ఆ తరువాత భర్తకు దూరంగా ఉంటున్న సౌందర్య సంసార జీవితాన్ని సరిదిద్దడానికి రజనీకాంత్‌ కుటుంబ హితులు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. దీంతో గత డిసెంబర్‌ నెలలో సౌందర్య, అశ్విన్‌ రామ్‌కుమార్‌లిద్దరూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకులకు పిటీషన్‌లు దాఖలు చేశారు. ఈ కేసును నాయ్యమూర్తి మరియా విచారిస్తున్నారు. గతనెల 26న సౌందర్య, అశ్విన్‌ రామ్‌కుమార్‌ కోర్టుకు హాజరై వివాహ రద్దుపై వివరణ ఇచ్చారు.

అనంతరం జూలై 4వ తేదీన తుది తీర్పును ప్రకటిస్తానని న్యాయమూర్తి తెలిపారు. కాగా మంగళవారం సౌందర్య రజనీకాంత్‌కు, అశ్విన్‌ రామ్‌కుమార్‌కు విడాకులను మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. అయితే ఈ విడాకుల వ్యవహారంపై సౌందర్యతో పాటు అశ్విన్‌ పెదవి విప్పలేదు. ఈ సందర్భంగా సౌందర్య తరఫు న్యాయవాది మాట్లాడుతూ దంపతుల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్ర రూపం దాల్చడంతోనే ఇక కలిసి జీవించేలేమని నిర్ణయానికి వచ్చాకే విడాకులు తీసుకోవాలని సౌందర్య కోర్టును ఆశ్రయించలినట్లు తెలిపారు.

మరోవైపు సౌందర్య రజనీకాంత్‌ ’వీఐపీ-2’ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ధనుష్‌, అమలాపాల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి కాజోల్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.