రజినీ అభిమానులంటే ఇలాగే ఉంటారు

0

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు తమిళనాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరు పదుల వయసు దాటి ఏడు పదుల వయసుకు చేరువు అవుతున్నా కూడా రజినీకాంత్ ను అభిమానులు దేవుడిలా ఆరాధిస్తూనే ఉన్నారు. రజినీకాంత్ సినిమా విడుదలవుతుందంటే తమిళనాట ఒక పండుగ వాతావరణం కనిపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రజినీకాంత్ తాజాగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించిన ‘పేట’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన థియేటర్ల వద్ద సందడి మామూలుగా లేదు.

సహజంగానే తమిళనాట స్టార్ హీరోల అభిమానులు దుమ్ము దుమ్ముగా రెచ్చి పోతారు. ఇక రజినీకాంత్ అభిమానుల గురించి చెప్ప తరమే ఉండదు. రజినీకాంత్ వీరాభిమాని అన్ బరసు అభిమానంలో మరో అడుగు ముందుకు వేశాడు. తన పెళ్లికి పేట సినిమా విడుదల తేదీని సుభ ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నాడు. చెన్నైలోని పేట విడుదలైన ఒక థియేటర్ ముందు హిందూ సాంప్రదాయం పద్దతిలో అన్బరసు రజినీ అభిమానులు మరియు బంధు మిత్రుల సమక్షంలో కామాక్షి మెడలో తాళి కట్టాడు. థియేటర్ ముందు అత్యంత హంగామాతో పేట సినిమా పోస్టర్ల సమక్షంలో రజినీకాంత్ ఆశీస్సులతో అతడి పెళ్లి జరిగింది.

కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు రజినీకాంత్ అభిమానుల నుండి పెద్ద ఎత్తున బహుమానాలు అందాయి. రజినీకాంత్ అభిమాన సంఘం వారు ఈ పెళ్లి ఖర్చు పెట్టుకున్నట్లుగా కూడా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ పెళ్లి టాక్ ఆఫ్ ది సౌత్ ఇండియా అయ్యింది. మరో వైపు ‘పేట’ మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో తమిళనాట కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. తెలుగులో మాత్రం ఈ చిత్రంకు కాస్త తక్కువ థియేటర్లు పడటంతో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదని చెప్పాలి. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
Please Read Disclaimer