సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘కుకూ’

0వినాయక చవితి కానుకగా రిలీజైన ‘2.0’ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇండియన్ సినిమా టీజర్ రికార్డులన్నింటినీ ఇది సునాయాసంగా దాటేసింది. 24 గంటల వ్యవధిలో అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంల వ్యూస్ కలిపితే 3.25 కోట్లుగా తేలడం విశేషం. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్’ సగర్వంగా ప్రకటించుకుంది. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమా టీజర్ కూడా 24 గంటల వ్యవధిలో ఇన్ని వ్యూస్ తెచ్చుకోలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం యూట్యూబ్ లో మాత్రమే దీనికి రెండున్నర కోట్ల దాకా వ్యూస్ రావడం విశేషం. ‘2.0’పై ఉన్న అంచనాల ప్రకారం చూస్తే ఇది మరీ ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ కాదు. ఇక టీజర్లోని విశేషాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. శంకర్ మరోసారి విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నాడని ఈ టీజర్ సంకేతాలిచ్చింది.

ఐతే ‘2.0’ టీజర్లో విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలమంతా ఒకెత్తయితే.. టీజర్ చివర్లో సూపర్ స్టార్ తనదైన శైలిలో ‘కుకూ’ అనడం మరో ఎత్తు. టీజర్ కు ఇంతకంటే మంచి ఫినిషింగ్ ఉండదేమో. ఈ చిన్న మాటతో రజనీ తన అభిమానుల్ని ఉర్రూతలూగించేశాడు. 60 ఏళ్ల పైబడ్డ రజనీని చిన్న పిల్లలకు బాగా చేరువ చేసిన సినిమా ‘రోబో’. అందులో రజనీ విన్యాసాలు పిల్లల్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా అనూహ్యమైన విజయం సాధించడానికి పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి థియేటర్లకు పోటెత్తడం కూడా ఒక కారణమే. ఇప్పటికీ ‘రోబో’ వస్తోందంటే చిన్నారులు టీవీలకు అతుక్కుపోతారు. వాళ్లంతా కూడా ‘2.0’ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీజర్లోని ‘కుకూ’ డైలాగ్ పిల్లల్ని కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఫ్యాన్స్ అయితే ఈ మాట పలికేటపుడు రజనీ ఎక్స్ ప్రెషన్.. స్టైల్ చూసి పులకించిపోతున్నారు. దీని వరకు కట్ చేసి జీఐఎఫ్ చేసి వైరల్ చేస్తున్నారు. అలా ‘కుకూ’ సోషల్ మీడియాను ఊపేస్తోందిప్పుడు.