వివాదాల భామకు పంజాబీ కుర్రాడు కావాలట!

0వివాదానికి పేరు మారిస్తే.. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ పేరు పెట్టొచ్చని పలువురు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తుంటారు. దీనికి తగ్గట్లే ఆమె వైఖరి ఉంటుందన్నది మర్చిపోకూడదు. నిత్యం ఏదో వివాదంలో తన పేరును జత చేసుకుంటే కానీ రాఖీకి నిద్ర పట్టదని వ్యాఖ్యానించే వారు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. తనకు వివాదాల్లో ఉండాలన్న ఆశ లేని చెప్పే రాఖీ తాజాగా మరో ఆసక్తికర వ్యాఖ్యను చేసింది.

వివాదాల్లో ఉండటం తనకు ఇష్టం ఉండదని.. చూస్తూ.. చూస్తూ.. వివాదాలను ఎవరు ఇష్టపడతారు? అని ప్రశ్నించింది. తన విధిరాత ఇలానే ఉందని.. జనాలంతా తాను వివాదాల కోసమే పుట్టినట్లుగా అనుకుంటారని చెప్పింది. ఓవైపు ఈ తరహాలో మాట్లాడుతూనే.. మళ్లీ అంతలోనే మాట మార్చుకొని.. తాను వివాదాల కోసమే పుట్టినట్లుగా వ్యాఖ్యానించింది. “నేను వివాదాల కోసమే పుట్టా” అంటూ తాజాగా వ్యాఖ్యలు చేసింది. తాజాగా చండీగఢ్ లోని జీరఖ్ పూర్ కు వచ్చిన ఆమె.. స్థానిక మీడియాతో మాట్లాడిన సందర్భంగా సన్నీ లియోన్ ప్రస్తావన వచ్చింది.

దీనిపై స్పందించిన ఆమె.. ఆమెకు.. తనకు చాలా తేడా ఉందని.. ఆమె గురించి తానేం మాట్లాడలేనన్నారు. తన దృష్టి మొత్తం సినిమాల మీదనే ఉందన్న ఆమె.. తాను పెళ్లి గురించి ఆలోచించటం లేదని చెప్పారు. చెప్పిన మాట మీద నిలబడని రాఖీ.. పెళ్లి విషయంలోనూ మాటను మార్చేశారు. పంజాబీ కుర్రాళ్లు బాగుంటారని.. పంజాబీ కుర్రాడు ఎవరైనా తనకు దొరికితే బాగుండంటూ చెప్పారు. రాఖీని చేసుకునేందుకు పంజాబీ కుర్రాడు దొరుకుతాడో లేదో కానీ.. ఆమె మాటకు పంజాబీలు సంతోషపడిపోవటం ఖాయమని చెప్పక తప్పదు.