అలా నటిస్తేనే చూస్తారు: రకుల్‌ప్రీత్‌సింగ్‌

0Rakul-preet-singh-hotఅభిమానులకు నచ్చేది హీరోయిన్ల అందాలేనంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌. మొదట్లో లక్కులేని నటి అనే రిమార్క్‌తో కోలీవుడ్‌ నుంచి మూటాముల్లె్ల సర్దుకుని టాలీవుడ్‌లో మకాం పెట్టిన ఈ బ్యూటీకి అక్కడ లక్కే లక్కు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించిన తాజా చిత్రం రారండోయ్‌ వేడుక చూద్దాం కూడా విజయబాటలో పయనించడంతో యమ జోష్‌లో ఉంది. అయితే అదే జోష్‌ను కోలీవుడ్‌లో పొందాలని తహతహలాడుతున్న ఈ జాణ ప్రస్తుతం కార్తీతో ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడిచ్చిన భేటీ చూద్దాం.

ముద్దు సన్నివేశాల్లో నటిస్తా..

సినిమా షూటింగ్‌ లొకేషన్స్‌ నాకు పాఠశాల మాదిరి. నిత్యం ఒక విద్యార్థిలా వచ్చి నటించి వెళుతుంటాను. అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. జయాపజయాల గురించి చింతించకుండా శ్రమిస్తున్నాను. సినిమా నుంచి గ్లామర్‌ను వేరు చేయలేం. హీరోయిన్లు గ్లామరస్‌గా నటిస్తేనే అభిమానులు చూస్తారు. గ్లామర్‌ దుస్తుల్లోనూ హీరోయిన్లను దేవతలుగా చూడవచ్చు. ఇకపోతే ముద్దు సన్నివేశాల్లో నటించడం తప్పు కాదు. కథకు అవసరం అయితే అలాంటి సన్నివేశాల్లో నేను దారాళంగా నటిస్తాను.

అయితే ఆ సన్నివేశాలు అశ్లీలంగా ఉండకూడదు. కొందరు ప్రచారం కోసమే ముద్దు సన్నివేశాలు చిత్రీకరిస్తారు. అలాంటి ముద్దు సన్నివేశాల్లో నటించడం నాకు నచ్చదు. సినిమా నాకు చాలా నచ్చింది. విరామం లేకుండా నటిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. కథను నేనే ఎంపిక చేసుకుంటున్నాను. మంచి పాత్రలు అనిపిస్తేనే అంగీకరిస్తున్నాను. సినిమా నాకు చాలా ఇచ్చింది. ఇక్కడ నేనేమీ కోల్పోలేదు.

కొన్ని చిత్రాలకు కాల్‌షీట్స్‌ ఇచ్చి అందులో నటించకుండా దర్శక నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నాననే వదంతులు ప్రచారం చేస్తున్నారు.నిజానికి నేనెప్పుడూ అలా చేయను. అదే విధంగా చిత్ర జయాపజయాల గురించి బాధపడను. ఒక చిత్ర పరాజయానికి అందులో పని చేసిన వారందరూ బాధ్యత వహించాలి. నగ్న సత్యం ఏమిటంటే ఈ చిత్రం విజయం సాధిస్తుంది, ఈ చిత్రం అపజయం పాలవుతుందని ఎవరూ చెప్పలేరు. స్టార్‌ నటీనటులు నటించిన భారీ బడ్జెట్‌ చిత్రాలూ ఫ్లాప్‌ అవుతున్నాయి. చిన్న చిత్రాలు మంచి సక్సెస్‌ సాధిస్తున్నాయి అంటూ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ భేటీకి ముగింపు పలికింది.