ఎన్టీవోడికి అతిలోక సుందరి ఫిక్స్!

0నటీ నటుల ఎంపిక.. సింపుల్ గా ఇంగ్లీష్ లో చెప్తే ‘క్యాస్టింగ్’ సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందులోనూ ఒక బయోపిక్ లో క్యాస్టింగ్ ఎంత ముఖ్యమో ఈమధ్యనే ఘన విజయం సాధించిన ‘మహానటి’ ప్రూవ్ చేసింది. ఒక్క సావిత్రి పాత్ర మాత్రమే కాకుండా మిగతా పాత్రల ఎంపికకు నాగ్ అశ్విన్ – మహానటి టీమ్ పెద్ద కసరత్తే చేశారు. ఇప్పుడు ‘ఎన్టీఆర్’ టీమ్ కూడా అదే టెంప్లేట్ ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నేషనల్ అవార్డు గ్రహీత – బాలీవుడ్ నటి అయిన విద్యా బాలన్ నటిస్తోంది. ఇతర కీలక పాత్రలలో రానా దగ్గుబాటి – ప్రకాష్ రాజ్ లాంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. మరికొందరు నటుల పేర్లపై ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాలో నటించే అవకాశముందని ఈమధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ రకుల్ ను ఏ పాత్ర కోసం పరిశీలిస్తున్నారన్న విషయం పై క్లారిటీ లేదు. ఫిలిం నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం రకుల్ ను అతిలోక సుందరి శ్రీదేవి పాత్ర కోసం తీసుకుంటున్నారట.

డైరెక్టర్ క్రిష్ రకుల్ అయితేనే శ్రీదేవి పాత్రకు సరిగ్గా సూట్ అవుతుందని భావిస్తున్నాడట. నిడివి తక్కువే అయినా శ్రీదేవి పాత్ర కావడం పైగా టాలీవుడ్ లో ఇదొక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావడంతో రకుల్ వెంటనే ఒప్పుకుందట. ఎన్టీఆర్ – శ్రీదేవి కాంబినేషన్ లో ‘బొబ్బిలి పులి’ – ‘జస్టిస్ చౌదరి’ – ‘సర్దార్ పాపారాయుడు’ – ‘వేటగాడు’ లాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ లు ఉన్నాయి. ఆ బ్లాక్ బస్టర్లలో ‘ఆకుచాటు పిందె తడిసే’ .. ‘ముద్దు మీద ముద్దు పెట్టు’.. ‘జాబిలితో చెప్పనా’ చార్ట్ బస్టర్లు కూడా ఉన్నాయి.. సో.. గెట్ రెడీ ఫర్ సమ్ ఫన్!