జోరు తగ్గిందంటే ఒప్పుకోను : రకుల్

0టాలీవుడ్ లోని దాదాపు యువ స్టార్ హీరోలందరితో నటించేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రస్తుతం ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి అంటూ టాక్ వినిపిస్తుంది. తెలుగులో స్పైడర్ చిత్రం తర్వాత ఈమె మరింత క్రేజీ హీరోయిన్ గా మారడం ఖాయం అంటూ అంతా అనుకున్నారు. కాని షాకింగ్గా ఆ చిత్రం నిరాశ పర్చడంతో రకుల్ కు తెలుగులో అసలు ఆఫర్లే కరువయ్యాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గత కొన్ని రోజులుగా ప్రభాస్ తో సినిమా ఛాన్స్ వస్తుందని ఆశించిన రకుల్ కు నిరాశే మిగిలింది. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సమయంలోనే రకుల్ జోరు తగ్గింది అంటూ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. స్పైడర్ చిత్రం తర్వాత తాను తెలుగు చిత్రాలకు కాస్త దూరం అయిన మాట వాస్తవమే. కాని తాను అవకాశాలు లేకుండా మాత్రం లేను అని – తమిళం మరియు హిందీల్లో వరుసగా చిత్రాలు చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. డైరీలో 30 రోజులు మాత్రమే ఉంటున్నాయని – ఎంత ప్రయత్నించినా కూడా ఎక్కువ చిత్రాలు చేయలేక పోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. నెలలో ఎక్కువ రోజులు ఉంటే ఎక్కువ సినిమాలు చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తాను తమిళంలో మూడు చిత్రాలను చేయడంతో పాటు – హిందీలో అజయ్ దేవగణ్ తో ఒక చిత్రాన్ని చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. తెలుగు నుండి ఆఫర్లు వచ్చినా కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు అన్నట్లుగా ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. రకుల్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు ముగింపు దశకు చేరుకున్నాయని కొత్త ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్నా కూడా రావడం లేదంటూ కొందరు అంటున్నారు. కింద పడ్డా నాదే పై చేయి అన్నట్లుగా రకుల్ మాటలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.