అల్లుళ్ల కోసం చిరు.. చెల్లి కోసం చరణ్

0తమ ఫ్యామిలీలో నటీనటులందరినీ కలిపితే క్రికెట్ జట్టు తయారవుతుందంటూ ఆ మధ్య మెగా హీరో వరుణ్ తేజ్ జోక్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇదేమీ అతిశయోక్తి కాదు. టాలీవుడ్లోనే కాదు.. ఏ ఇండస్ట్రీలోనూ ఒక ఫ్యామిలీలో ఇంతమంది యాక్టివ్ ఆర్టిస్టులు లేరు. అందులో కొందరు మంచి విజయాలతో దూసుకెళ్తుంటే కొందరు తడబడుతున్నారు. వారి కోసం మెగా ఫ్యామిలీ పెద్దలు సపోర్టివ్వడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి తరచుగా తన ఫ్యామిలీ హీరోల సినిమాల ఆడియో – ప్రి రిలీజ్ ఈవెంట్లకు వస్తుంటారు. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ‘తేజ్ ఐ లవ్యూ’తో పాటు హీరోగా పరిచయం అయిన తన అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమా ‘విజేత’ వేడుకలకు చిరు హాజరైన సంగతి తెలిసిందే. కానీ వాళ్లిద్దరినీ చిరు ఆదుకోలేకపోయాడు.

ఐతే ఇప్పుడు చిరు తనయుడు రామ్ చరణ్ తమ ఫ్యామిలీలో స్ట్రగులవుతున్న మరో ఆర్టిస్టు కోసం రంగంలోకి దిగుతున్నాడు. నాగబాబు తనయురాలు నిహారిక నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ ఆడియో వేడుకకు చరణే చీఫ్ గెస్టుగా రానున్నాడు. శనివారం ఈ ఈవెంట్ జరగనుంది. నిహారిక తొలి సినిమా ‘ఒక మనసు’ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘హ్యాపీ వెడ్డింగ్’లో నటించింది నిహారిక. ఈ చిత్రానికి అనుకున్నంత బజ్ లేదు. జులై 28న రాబోతున్న ఈ చిత్రానికి కొంచెం హైప్ తేవడానికి రామ్ చరణ్ ఉపయోగడపతాడని భావిస్తున్నారు. లక్ష్మణ్ కార్య అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్ నిర్మించింది. నిహారికకు జోడీగా సుమంత్ అశ్విన్ నటించాడు. మరి చరణ్ రాకతో అయినా ఈ చిత్రానికి బజ్ వస్తుందేమో చూడాలి.