100 రోజుల పోటీ..మహేష్ ను దాటిన చరణ్

0రెండు దశాబ్ధాల క్రితం 100 రోజులు సినిమా ఆడిందంటే అది బ్లాక్ బస్టర్ హిట్.. అప్పట్లో ఎన్టీఆర్ – ఏఎన్నార్ – కృష్ణ తదితర హీరోల చిత్రం 100 – 200 రోజులు – సంవత్సరం కూడా ఆడిన రోజులున్నాయి. కానీ ఇప్పుడు 100 రోజులు కాదు కదా.. కనీసం గట్టిగా వారం కూడా సినిమాలు ఆడడం లేదు. రెండు వారాలకే థియేటర్లలోకి వేరే సినిమా వచ్చేస్తోంది. వేల థియేటర్లలో ఒకేసారి సినిమాను రిలీజ్ చేసి వారం రోజుల్లోనే రికార్డు కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు సినీ నిర్మాతలు.. వారం దాటితే ఎలాగూ పైరసీ సీడీలు మార్కెట్ లోకి వచ్చి ఎవ్వరూ చూడడం లేదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పాలసీని టాలీవుడ్ లో అమలు చేస్తున్నారు. తొలి షోతోనే కలెక్షన్ల వేట మొదలు పెడుతున్నారు..

అందుకే ఇప్పుడు ఓ సినిమా 100 రోజులు ఆడిందంటే వింతగా చూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు వందల థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకునేవి. హీరోలు ఆయా థియేటర్లకు వెళ్లి విజయోత్సవ సభలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితిని భూతద్దంలో పెట్టి వెతికినా కనిపించడం లేదు. రెండు వారాలు ఆడితే అదే గొప్పగా పరిస్థితి తయారైంది.

గడిచిన వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకొని సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా ‘రంగస్థలం’ రిలీజ్ అయ్యింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రికార్డు కలెక్షన్లు సాధించింది. 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకొని రాంచరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

రంగస్థలం తర్వాత వచ్చిన మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ కూడా గ్రాండ్ హిట్ అయ్యింది. తాజాగా ఈ చిత్రం ఆరు కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. విజయవాడ (కాపర్తి) – తిరుపతి (విఖ్యాత్) – తెనాలి(స్వరాజ్) – చిలకూరిపేట (కళామందిర్) – కాకినాడ (అంజని) – రాజమండ్రి(అశోక) సెంటర్లలో ఈ ఘనత సాధించింది. ఈ చిత్రం దాదాపు 100 కోట్ల షేర్ ను సాధించి మహేష్ కెరీర్ లోనే హ్యాయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఈ ఇద్దరు స్టార్ హీరోల 100 రోజుల పోటీల్లో ప్రస్తుతానికైతే రాంచరణ్ ముందున్నారు. ఆయన రంగస్థలం 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడితే.. మహేష్ ’భరత్ అనే నేను’ కేవలం 6 కేంద్రాల్లోనే ఆ ఘనత సాధించింది.