చెర్రీ వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ ఎందుకు?

0అత్తారింటికి దారేది సినిమాలో హీరో ఎంత రిచ్ అన్న విషయాన్ని హీరోయిన్ సమంత చెప్పే క్రమంలో.. వాడి వాచీ ఒక్కటి చాలు నీ లైఫ్ సెట్ అయిపోవటానికి అంటుంది. లక్ష కోట్ల అధిపతిగా నటించిన పవన్ పెట్టుకున్న వాచీ ఎంత ఖరీదైనదో చెప్పటానికి ఈ సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్ రాశారు. అయితే.. దగ్గర దగ్గర కోటి రూపాయిలకు దగ్గరగా ఉండే వాచ్ పెట్టుకోవటానికి లక్ష కోట్ల రూపాయిల ఆస్తి పాస్తి కానక్కర్లేదు.. చెర్రీ అయితే చాలన్నట్లుగా ఉంది తాజా ముచ్చట చూస్తే.

చెర్రీ ఏంటి?.. ఆయన పెట్టుకునే వాచ్ ఏంటి?.. అత్తారింటి దారేది మూవీ ఏంటి? అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారా? అస్సలు అక్కర్లేదు. క్లారిటీగా చెబుతాం. ఈ మధ్యన ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే మనమరాలు శ్రియా భూపాల్ పెళ్లి జరిగింది తెలుసుకదా? ఈ కార్యక్రమానికి సతీసమేతంగా హాజరయ్యారు చెర్రీ.

అందరి మాదిరి రెఢీ అయి వచ్చినప్పటికీ.. చెర్రీ మాత్రం అందరి నోట్లో నానారు. ఎందుకంటే.. ఆయన పెట్టుకొచ్చిన వాచ్ అలాంటిది. ఇప్పటి వరకూ ఖరీదైన వాచ్ లు వాడే హీరోలు టాలీవుడ్లో చాలామందే ఉన్నారు. తారక్ కు వాచీలంటే యమా ఇష్టం. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే ఖరీదైన వాచ్ లు కొనేస్తూ తన కలెక్షన్ ను అంతకంతకూ పెంచుకుంటారని చెబుతారు.

అయితే.. ఖరీదైన వాచ్ కొనుగోలులో మిగిలిన హీరోలందరికి ల్యాండ్ మార్క్ మాదిరి సెట్ చేశారు చెర్రీ. జీవీకే వారి పెళ్లికి ఆయన పెట్టుకొచ్చిన పింక్ గోల్డ్ వాచీ ధర ఏకంగా రూ.80 లక్షల వరకూ ఉంటుందని చెబుతున్నారు. డాలర్లలో చెప్పాల్సి వస్తే.. 1.15లక్షలుగా చెబుతున్నారు. మన రూపాయిల్లో అయితే దగ్గరదగ్గర రూ.80లక్షలకు పైనే. పాటక్ ఫిలిప్పీ బ్రాండ్ అయిన ఈ వాచ్ చాలా ఖరీదైనదిగా చెబుతారు. ఇప్పటి వరకూ చాలామంది హీరోలు రూ.10లక్షలు.. రూ.20 లక్షల వాచ్ లు పెట్టుకున్నారే కానీ.. ఏకంగా రూ.80లక్షలకు పైనే ఉన్న వాచ్ పెట్టుకోవటం మాత్రం చెర్రీకి మాత్రమే సాధ్యమైందంటున్నారు. మరి.. మెగాస్టార్ కొడుకు.. రంగస్థలం లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన హీరో ఆ మాత్రం ఖరీదైన వాచ్ పెట్టుకోడా ఏంది?