రంగస్థలంలో చరణ్ స్టూడియో

0మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రంగస్థలం మూవీతో తన సత్తా చాటిచెప్పాడు. రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు తెచ్చిపెట్టడంతో నటుడిగా ఎవరూ వేలెత్తి చూపలేనంత ఎత్తులో నిలబెట్టిందీ చిత్రం. రంగస్థలం అనే పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ గా వచ్చిన ఈ పీరియాడికల్ ఫిలిం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రంగస్థలం మూవీలో ప్రేక్షకులను మెప్పించింది 80ల నాటి పల్లె వాతావరణం. అచ్చుగుద్దినట్టు ఆనాటి గోదావరి జిల్లాల వాతావరణం మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుంది. కానీ ఈ సెట్ వేసింది హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో. 25 ఎకరాల విస్తీర్ణంలో వేసిన ఈ సెట్ ఆమధ్య టూరిస్ట్ స్పాట్ గా కూడా మారిపోయింది. ప్రస్తుతం ఇదే సెట్లో మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి షూట్ చేస్తున్నారు. ఈ స్థలం రామ్ చరణ్ కొనేశాడనేది తాజాగా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

భవిష్యత్తు సినిమా అవసరాల కోసం ఇక్కడో స్టూడియో కట్టాలనేది అతడి ఆలోచన అని తెలుస్తోంది. చిరంజీవి కూడా ఎప్పటి నుంచో ఓ స్టూడియో కట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. కానీ అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. అందుకే రామ్ చరణ్ ఈ స్థలం సొంతం చేసుకున్నాడనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఈ ల్యాండ్ ఇంకా రామ్ చరణ్ కొనలేదని.. దాని ఓనర్ వేరే ఉన్నాడని ఇంకొందరు చెబుతున్నారు. ఆ ఓనర్ కూడా సినిమాకు సంబంధించే కన్ స్ట్రక్షన్ చేసే ఆలోచనలో ఉన్నాడంటున్నారు. వీటిలో ఏది నిజమో తెలియాలంటే ఇంకొద్ది కాలం ఆగాలి.