అమెరికాలో చరణ్ పరువు తీసి పడేసిందిగా..

0

 రామ్ చరణ్-బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’కు ఎంత బ్యాడ్ టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు భారీ వసూళ్లే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి శుక్రవారం రూ.26 కోట్ల షేర్ రావడం విశేషం. కానీ రెండో రోజు ఆ ఊపు కొనసాగలేదు. బ్యాడ్ టాక్ బాగానే దెబ్బ తీసింది. కేవలం రూ.4 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. మరి ఆదివారం పరిస్థితి ఏంటో చూడాలి. ఫుల్ రన్లో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో కానీ.. అమెరికాలో మాత్రం ‘వినయ విధేయ రామ’ పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది. మామూలుగా యుఎస్ లో ఏ కొత్త సినిమాకైనా ప్రిమియర్ల తర్వాత అత్యధిక వసూళ్లు వచ్చేది శనివారమే. తెలుగు ఎన్నారైలు ఎక్కువగా థియేటర్లకు వెళ్లేది ఆ రోజే.

అలాంటి రోజు ‘వినయ విధేయ రామ’కు మరీ తీసికట్టుగా 19 వేల డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఇదే రోజు ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ లక్ష డాలర్లకు పైగా వసూలు చేయగా.. సంక్రాంతి రేసులో చివరగా రిలీజైన ‘ఎఫ్-2’ ఏకంగా 3.5 లక్షల డాలర్లు కొల్లగొట్టింది. రజనీకాంత్ సినిమా ‘పేట్ట’ తమిళ – తెలుగు భాషల్లో కలిపి ఒక్క రోజులో హాఫ్ మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. చివరికి అస్సలు యుఎస్లో మార్కెట్ లేని అజిత్ నుంచి వచ్చిన ‘విశ్వాసం’ సైతం శనివారం 45 వేల డాలర్లు వసూలు చేసింది. అలాంటిది ‘రంగస్థలం’తో 3.5 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన రామ్ చరణ్ నుంచి వచ్చిన తర్వాతి సినిమా శనివారం రోజు 20 వేల డాలర్లు కూడా రాబట్టలేకపోవడం పెద్ద పరాభవమే. కాస్త ఇమేజ్ ఉన్న ఏ హీరో సినిమాకూ తొలి శనివారం ఇంత దారుణమైన వసూళ్లు ఉండవు. మొత్తంగా ఈ చిత్రం ఇప్పటిదాకా అక్కడ వసూలు చేసింది 2.3 లక్షల డాలర్లు మాత్రమే. అందులో ప్రిమియర్లతో వచ్చినవే 1.8 లక్షల డాలర్లు.
Please Read Disclaimer