చిట్టిబాబు మెచ్చేసుకున్నాడు

0మొన్న శుక్రవారం విడుదలైన విజేత ఫాదర్ సెంటిమెంట్ ఉన్న ఫ్యామిలీ మూవీగా పేరైతే తెచ్చుకుంది కానీ దాని తాలూకు ప్రభావం మాత్రం వసూళ్లపై అంతగా కనిపించడం లేదు. దర్శకుడు రాకేష్ శశి ఎమోషనల్ గా కథను నడిపిన విధానం ఒక వర్గం ప్రేక్షకులను బాగానే మెప్పిస్తోంది. ఇదిలా ఉంచితే కళ్యాణ్ దేవ్ ఫస్ట్ మూవీ కాబట్టి ప్రమోషన్ వీలైనంత యాక్టివ్ గా ఉంచడం కోసం మెగా ఫ్యామిలీలో స్టార్స్ ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. మొన్న కళ్యాణ్ దేవ్ మావయ్య మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రీమియర్ షో చూసి యూనిట్ ని సన్మానించి నాలుగు మాటలు చెప్పేసారు. పాజిటివ్ టాక్ వచ్చిన ఏ సినిమాకైనా చిరు ఇలా స్పందించడం మామూలే. అందులోనూ తన చిన్నల్లుడు కాబట్టి ప్రత్యేక శ్రద్ధ ఉండటం వింతేమి కాదు. ఇప్పుడు లైన్ లోకి చిట్టిబాబు కూడా వచ్చేశాడు. అదేనండి రంగస్థలంలో సౌండ్ ఇంజినీర్ గా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన రామ్ చరణ్ తేజ్.

విజేత చూసాక తన ఫీలింగ్స్ తో పాటు యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించిన రామ్ చరణ్ కళ్యాణ్ దేవ్ తో పాటు అందులో నటించిన మురళీశర్మ – తనికెళ్ళ భరణిల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా కళ్యాణ్ దేవ్ తో బొకే ఫోటో కూడా షేర్ చేసుకున్నాడు. అయినా ఇలా ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకోవడం అందరూ స్టార్ హీరోల ఫ్యామిలీస్ లో కామనే కానీ కళ్యాణ్ దేవ్ కోసం మాత్రం రెండో రోజే సీన్లోకి వచ్చేసారు. విజేత ఫైనల్ స్టేటస్ మరో మూడు నాలుగు రోజుల్లో తెలిపోతుంది. వీక్ ఎండ్ కాబట్టి గడిచిపోతుంది కానీ ఆ తరువాత కాస్త స్టడీగా ఉంటే మాత్రం నిలదొక్కుకున్నట్టే. అన్నట్టు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా ట్విట్టర్ లో విజేత టీమ్ ని గ్రీట్ చేయటం విశేషం. ఇలా మెగా ఫ్యామిలీ నుంచే రోజుకొకరు విష్ చేసినా రెండు వారాలు గడిచిపోతాయి.