వర్మ ఈజ్ బ్యాక్ విత్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’!

0

తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే వర్మ…కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. `ఆఫీసర్` డిజాస్టర్ తర్వాత వర్మ సోషల్ మీడియాలో కూడా పెద్ద యాక్టివ్ గా లేరు. `ఆర్ ఎక్స్ 100` – `భైరవగీత`ల ప్రమోషన్ పోస్టుల మినహా గతంలో మాదిరి ఇతరత్రా విషయాలపై స్పందించడం – వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా – వర్మ తన ఫేస్ బుక్ లో ఓ ఆసక్తికర పోస్ట్ తో మళ్లీ వార్తల్లో కెక్కారు. దాదాపుగా అటకెక్కిందని భావిస్తోన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని దసరా నాడు లాంచ్ చేయబోతున్నట్లు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయబోతున్నట్లు వర్మ ప్రకటించి షాకిచ్చారు. అంతేకాదు అక్టోబరు 19న తిరుపతిలో జరగనున్న ముహూర్త కార్యక్రమానికి అనుకోని అతిథులు వచ్చి సర్ ప్రైజ్ చేస్తారని వర్మ చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముంబైకు చెందిన జీవీ ఫిల్మ్స్ ఎండీ బాలగిరి తిరుపతిలో `లక్ష్మీస్ ఎన్టీఆర్` ముహూర్త కార్యక్రమం నిర్వహిస్తారని వర్మ పోస్ట్ చేశారు. రాకేష్ రెడ్డితో పాటు – జీవీ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయని వర్మ చెప్పారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించడానికి ముందే `ఎన్టీఆర్` ముగుస్తుందని అన్నగారి జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత `లక్ష్మీస్ ఎన్టీఆర్` మొదలవుతుందని వర్మ పోస్ట్ చేశారు. కాగా బాలయ్య హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతోన్న `ఎన్టీఆర్` బయోపిక్ కు మొదట వర్మనే దర్శకుడిగా ఎంపిక చేసినట్లు గతంలో పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ ప్రాజెక్టుకు చేపట్టిన తేజ వైదొలగడంతో క్రిష్ పగ్గాలు చేపట్టి షూటింగ్ జరపడం తెలిసిందే. దాదాపుగా తేజ బయోపిక్ ప్రారంభం సమయంలోనే వర్మ కూడా `లక్ష్మీస్ ఎన్టీఆర్`ను ప్రకటించారు. అయితే కొంతకాలం నుంచి ఆ ప్రాజెక్టు పై ఎటువంటి అప్ డేట్స్ లేవు. దీంతో ఆ సినిమా కూడా వర్మ కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిందని సినీజనాలు అనుకున్నారు. కానీ తన చర్యలు ఊహాతీతం అని వర్మ మరోసారి నిరూపించుకుంటూ `లక్ష్మీస్ ఎన్టీఆర్` లాంచింగ్ ను ప్రకటించారు. క్రిష్ `కథా నాయకుడు` – `మహా నాయకుడు`లకు పోటీగా ఈ సినిమాను వర్మ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Please Read Disclaimer