ఎన్టీఆర్ తో ఆర్జీవీ సై

0డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్.. ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి తన తెగువ చూపించాడు. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త సినిమా ‘భైరవ గీత’ను దసరా బరిలో ఓ భారీ సినిమాకు పోటీగా నిలబెట్టాడు. అక్టోబరు 11న ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ‘అరవింద సమేత’ రిలీజ్ కానుండగా.. దాని తర్వాతి రోజే ‘భైరవ గీత రాబోతోంది’. దసరా సీజన్ మీద తెలుగు సినిమాలు చాలానే ఫోకస్ పెట్టాయి. కానీ ‘అరవింద సమేత’పై భారీ అంచనాలుండటంతో ఆ వారాంతంలో ఏ సినిమానూ రిలీజ్ చేయట్లేదు. ముందు వారం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’.. ‘నోటా’ విడుదల కానుండగా.. తర్వాతి వారానికి ‘హలో గురూ ప్రేమ కోసమే’ షెడ్యూల్ అయింది. మధ్య వారాన్ని ‘అరవింద సమేత’కు వదిలిపెట్టారు. అలాంటి సినిమాపై ‘భైరవ గీత’ను పోటీకి నిలబెట్టడం విశేషమే. ఈ చిత్రం అదే తేదీకి కన్నడలోనూ రిలీజ్ కానుంది.

కొత్త టాలెంటుని వెదికి పట్టుకోవడంలో వర్మకు వర్మే సాటి. అలాగే సిద్దార్థ అనే కొత్త దర్శకుడి టాలెంటుని పసిగట్టాడు. మరో నిర్మాతతో కలిసి వెంటనే అతడితో సినిమా మొదలుపెట్టాడు. ఈ చిత్రంతో ధనంజయ-ఐరా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఇంటెన్స్ పోస్టర్లతో జనాల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. ఇటీవలే ట్రైలర్ తో జనాల్ని పలకరించింది. ఆ ట్రైలర్లో అడుగడుగునా వర్మ ముద్ర కనిపించింది. ఆర్జీవీ ‘రక్తచరిత్ర’ స్టయిల్లో ఇంటెన్స్ యాక్షన్ కనిపించింది అందులో. సిద్దార్థపై వర్మ ప్రభావం చాలానే ఉన్నట్లుగా కనిపించింది ఈ ట్రైలర్ చూస్తే. ఇది కర్ణాటకలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఫ్యాక్షనిజం ఛాయలు కనిపిస్తున్నాయి. మరి ‘అరవింద సమేత’కు పోటీగా రాబోయే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.