డ్రగ్స్ కేసులో మహేశ్, పవన్‌లను లాగిన వర్మ

0RGV-tweetsడ్రగ్స్ వ్యవహారంలో మరోసారి తనదైన శైలిలో స్పందించారు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. డ్రగ్స్ కేసులో సినీ నటులు, దర్శకులకు నోటీసులు జారీ చేసిన నాటి నుంచి ఎక్సైజ్ శాఖ, సిట్‌పై ఆరోపణలు చేస్తున్న వర్మ.. తాజాగా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

ఇటీవల నిర్వహించిన యాంటీ డ్రగ్స్ ర్యాలీ(డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ)కి ఒకరిద్దరు మినహా సినీ ప్రముఖులు ఎవరూ పెద్దగా హాజరుకాలేదు. దీంతో వారినుద్దేశించి వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యాంటీ డ్రగ్స్ ర్యాలీకి హాజరుకాని సినీ ప్రముఖులు ఏదో ఒక రూపంలో డ్రగ్స్‌కు కనెక్ట్ అయ్యారా? అనే సందేహాన్ని వర్మ వ్యక్తపరిచారు.

యాంటీ డ్రగ్ మూమెంట్‌కు మద్దతు ఇవ్వకుండా ఉన్న సినీ ప్రముఖులకు నోటీసులు ఎందుకు జారీ చేయకూడదని ఆయన ప్రశ్నించారు. చివర్లో జస్ట్ ఆస్కింగ్ అంటూ ముగించారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ మేరకు ఆయన స్పందించారు.

అంతకుముందు ఫేస్‌బుక్‌లో మరో పోస్టు పెట్టారు. ‘గత 50ఏళ్లుగా సిగరేట్ తాగద్దురా మొర్రో అని అరిచి అరిచి చెప్పి సినిమాల్లో, పబ్లిక్ సర్వీస్ చిత్రాల్లో వేల సార్లు చూపించినా వినని వాళ్లు ఒక యాంటీ డ్రగ్ ర్యాలీ చేసినంత మాత్రాన మాత్రాన మానేస్తారా?’ అని వర్మ ప్రశ్నించారు.

‘వీళ్లు చేసిన ర్యాలీ చూసి డ్రగ్స్ తీసుకునే వాళ్లు డ్రగ్స్ తీసుకోవటం మానేస్తారని కనీసం ర్యాలీలో పాల్గొన్న వాళ్లలో ఒక్కరైనా నమ్ముతారా?’ అంటూ రాంగోపాల్ వర్మ నిలదీశారు.