అది కిడ్స్ సినిమా.. మాది అడల్ట్ సినిమా

0

వివాదాలతో ప్రచారం అన్నది రామ్గోపాల్ వర్మ ఎత్తుగడ. తన సినిమాలకు ప్రచారం కొట్టేయడానికి ఎలాంటి పన్నాగానికి తెర తీసేందుకైనా వెనకాడడు. అంతా `నా ఇష్టం` అన్న తీరుగానే చెలరేగిపోతాడు. పైగా అందరిలాగా డబ్బులిచ్చి ప్రచారం చేయించుకుంటే వర్మ అంత మేధావి అని ఎలా అనిపించుకోగలడు? అందుకే ఆయనకంటూ ఉచిత ప్రచార పథకం సిద్ధంగా ఉంటుంది. అపుడెపుడో మీడియా ప్రచారానికి డబ్బులెందుకని డిఫరెంటుగా ప్రమోషనల్ ఎత్తుగడల్ని పరిచయం చేసింది ఆర్జీవీనే. టీవీలు – పత్రికలు – మీడియాలు ఎలానూ ఆర్జీవీ లాంటి ఔత్సాహికులు చెప్పే కాకమ్మ కథలు వినవు కాబట్టి ఆయన వీళ్లతో పనిలేని ప్రమోషన్ ఎలా అన్నది కనిపెట్టి కొంతవరకూ విజయం సాధించాడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆర్జీవీని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన్ని ఆయన అభిమానులు మినహా మిగతావాళ్లెవరూ పట్టించుకోరు.

అందుకేనేమో.. ఈసారి ఆయన సమర్పించి రిలీజ్ చేస్తున్న భైరవగీత ప్రచారానికి కొత్త ఎత్తుగడ వేశాడు. 2.ఓ లాంటి భారీ చిత్రంతో పోటీపడుతూ భైరవగీత చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ప్రచారం ఊదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం రజనీ-శంకర్ కాంబినేషన్ మూవీ 2.0ని ఫుల్ గా వాడేస్తున్నాడు.. అది పిల్లల సినిమా మాది అడల్ట్ సినిమా.. ఏది నచ్చుతుందో తేల్చుకోండి! నిర్ణయం మీకే వదిలేస్తున్నాం!! అంటూ తెలివైన పదజాలంతో ప్రేక్షక జనాల్ని ముగ్గులోకి దించుతున్నాడు.

శుక్రవారం రాత్రి `భైరవగీత` ప్రీరిలీజ్ కాక్ టైల్ పార్టీలో ఆర్జీవీ తనదైన స్టైల్లో చిందులు వేశాడు. పెద్ద స్టార్లతో పెద్ద డైరెక్టర్ తీసిన 2.ఓ చిత్రం పిల్లల కోసం తీసిన సినిమా. చిన్న పిల్లాడు అయిన సిద్ధార్థ్ తీసిన సినిమా అడల్ట్స్ కోసం. ఛాయిస్ మీదే.. పిల్లల సినిమా చూస్తారా? పెద్దాళ్ల సినిమా చూస్తారా? అంటూ టీజ్ చేస్తూ గిల్లికజ్జాలు ఆడాడు వర్మ. 2.ఓ నవంబర్ 29న రిలీజవుతుంటే – ఆ మరుసటి రోజే భైరవగీత చిత్రం రిలీజవుతోంది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కులాంతర ప్రేమకథతో తెరకెక్కించిన భైరవగీత ట్రైలర్ ఇప్పటికే యూత్ని ఆకట్టుకుంది. అయితే 2.ఓ లాంటి క్రేజీ సినిమా ముందు ఇది ఎంతవరకూ నిలబడుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో తన సినిమాని కాపాడుకునేందుకు వర్మ నానా తంటాలు పడుతున్నాడు.
Please Read Disclaimer